బెంగళూరు,మహా.
ఐపీఎల్ క్రికెట్ అంటే ఉండే క్రేజే వేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఈ మత్తులో మునిగిపోతుంటారు. అయితే, కర్ణాటకలో ఈ క్రికెట్ సందడి కాస్త రాజకీయ రంగు పులుముకుంది. గత కొద్దిరోజులుగా టికెట్ల విషయంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ , ప్రజాప్రతినిధుల మధ్య నడిచిన ‘కోల్డ్ వార్’ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఎమ్మెల్యేల విమర్శలు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జోక్యంతో దిగివచ్చిన క్రికెట్ బోర్డు.. ఇప్పుడు ప్రజాప్రతినిధులకు ఉచితంగా టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. శుక్రవారం KSCA అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి ఈ విషయాన్ని వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.
**వీఐపీ హోదాలో మ్యాచ్ వీక్షణ.. ఒక్కొక్కరికి మూడు టికెట్లు**
శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని వెంకటేష్ ప్రసాద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్టేడియంలో జరిగే అన్ని మ్యాచులకు ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రత్యేకంగా వీఐపీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో ప్రజాప్రతినిధికి మూడు చొప్పున ఉచిత టికెట్లు అందజేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. సాధారణంగా టికెట్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేసి, క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండానే నేరుగా గ్యాలరీలోకి వెళ్లేలా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
**అసలు రచ్చ ఎక్కడ మొదలైందంటే?**
ఈ ఉచిత టికెట్ల వెనుక ఒక పెద్ద కథే నడిచింది. గురువారం నాడు కొందరు ఎమ్మెల్యేలు కేఎస్‌సీఏపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, సామాన్యుల తరహాలో టికెట్ల కోసం క్యూలో నిలబడాలా అంటూ మండిపడ్డారు. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపడంతో రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ప్రజాప్రతినిధులకు గౌరవప్రదంగా కనీసం రెండేసి టికెట్లయినా ఇవ్వాలని క్రికెట్ బోర్డును కోరారు. దాంతో మెట్టు దిగిన బోర్డు, ఏకంగా మూడు టికెట్లు ఇస్తామని ప్రకటించి ముఖ్యమంత్రితో భేటీ అయింది.
**రాజకీయ ఇగోల ముందు క్రికెట్ దిగ్గజం తలవంచాలా?**
అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. ముఖ్యమంత్రి ముందు వెంకటేష్ ప్రసాద్ చేతులు కట్టుకుని నిలబడిన ఫోటోపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఘాటుగా స్పందించారు. మైదానంలో పాకిస్థాన్ లాంటి జట్లకు చుక్కలు చూపించిన దిగ్గజ క్రికెటర్, కేవలం నాయకుల అహంకారం కారణంగా ఇలా వినయంగా నిలబడాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం కోసం ఒక ఐకానిక్ క్రీడాకారుడిని ఇలా తలవంచేలా చేయడం సరికాదని విమర్శించారు.







