- తెలంగాణ హాకీ చైర్మన్ విజయ్ కుమార్ అదుపులోకి!
- 12 గంటల పాటు సుదీర్ఘ విచారణ.
- కిలోల కొద్దీ బంగారం సీజ్.. ఐటీ విచారణా నీడలో ‘బంగారు బాబు’ ఆస్తుల చిట్టా!
హైదరాబాద్: మహా
‘బంగారు బాబు’గా సుపరిచితులైన హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారుల చిక్కుల్లో పడ్డారు. న్యూఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనను అధికారులు అదుపులోకి తీసుకోవడం క్రీడా, సామాజిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. విమానాశ్రయంలో దిగీ దిగగానే విజయ్ కుమార్‌ను చుట్టుముట్టిన ఐటీ అధికారులు, అక్కడే ప్రత్యేకంగా విచారణ ప్రారంభించారు. సుమారు 12 గంటల పాటు ఈ విచారణా పర్వం కొనసాగింది. నిత్యం కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించే అలవాటున్న ఆయన నుంచి, ఆ సమయంలో ఒంటిపై ఉన్న భారీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఆభరణాల సీజ్ చేయడమే కాకుండా, ఆయన పేరిట ఉన్న చర, స్థిరాస్తుల లెక్కలపై ఆరా తీశారు. ఆదాయ వనరులు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. సుదీర్ఘ విచారణ అనంతరం హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయనకు అధికారులు అనుమతినిచ్చారు. అయితే, విచారణ ఇంకా ముగియలేదని, మరోసారి తమ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ నుంచి క్రీడా ప్రతినిధిగా వెళ్లిన వ్యక్తి ఇలా విమానాశ్రయంలో ఐటీ అధికారులకు చిక్కడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.







