Mahaa Daily Exclusive

  కన్న తండ్రినే కాటేసిన కన్న కూతురు..! ఏడాది తర్వాత వీడిన పోలీస్ అధికారి హత్య మిస్టరీ..!

Share

  • కన్న తండ్రినే కాటేసిన కన్న కూతురు
  • ఏడాది తర్వాత వీడిన పోలీస్ అధికారి హత్య మిస్టరీ!
  •  ప్రేమ కోసం ‘యమపాశం’గా మారిన కూతురు.
  •  మిల్క్‌షేక్‌లో విషం కలిపి తండ్రిని చంపిన వైనం.
  •  హత్యను ‘సహజ మరణం’గా నమ్మించి పెళ్లి.
  •  ఏడాది తర్వాత గుట్టురట్టు చేసిన భర్త!

హైదరాబాద్, మహా.

వృత్తిరీత్యా శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే నేరానికి పాల్పడటం ఒక ఎత్తయితే, కన్న తండ్రి ప్రాణాలనే బలి తీసుకోవడం చంద్రపూర్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. జిల్లాలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న జయంత్ బల్లావర్ గతేడాది ఏప్రిల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించగా, అప్పట్లో అది గుండెపోటుగా అందరూ భావించారు. అయితే ఈ మరణం వెనుక ఆయన స్వంత కుమార్తె, పోలీస్ కానిస్టేబుల్ అయిన ఆర్యా బల్లావర్ అల్లిన కుట్ర దాగి ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ప్రేమకు తండ్రి అడ్డుపడుతున్నాడన్న ఏకైక కారణంతో, అత్యంత క్రూరంగా ప్లాన్ చేసి ఆయనను మృత్యువు ఒడిలోకి నెట్టింది.

గతేడాది ఏప్రిల్ 25వ తేదీన జయంత్ విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఆర్యా ఎంతో ప్రేమగా మిల్క్‌షేక్ ఇచ్చింది. తన కూతురు ఇచ్చిన ఆ పానీయాన్ని తాగిన కొద్దిసేపటికే ఆయన కార్యాలయ ప్రాంగణంలో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. అప్పట్లో తండ్రి మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించడంలో ఆర్యా విజయవంతమైంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా నాటకమాడింది. తండ్రి మరణం తర్వాత ఆమె తాను ప్రేమించిన ఆశీష్ షెడ్‌మేక్‌ను వివాహం చేసుకుంది. అయితే కాలక్రమేణా వారి మధ్య విభేదాలు పొడసూపాయి. భర్త ఆశీష్ తన ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో పోలీస్ శిక్షణ మధ్యలోనే ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు వెరసి వారి కాపురంలో చిచ్చు పెట్టాయి.

ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు ముదిరిపోవడంతో, గతేడాది జరిగిన అసలు నిజాన్ని ఆశీష్ పోలీసుల ముందు బయటపెట్టాడు. తన భార్య ఆర్యా తన తండ్రిని ఎలా చంపిందో, ఆ కుట్రలో ఎవరెవరు ఉన్నారో పూసగుచ్చినట్లు వివరించాడు. తన కజిన్ చైతన్య గెడం సహాయంతో కేవలం 5,000 రూపాయలకు విషం కొనుగోలు చేసి, దానిని తండ్రికి తాగించేలా ప్లాన్ చేశారని వెల్లడించాడు. ఆశీష్ ఇచ్చిన వాంగ్మూలంతో నిర్ఘాంతపోయిన పోలీసులు వెంటనే కేసును రీఓపెన్ చేశారు. లోతైన విచారణ అనంతరం ప్రధాన నిందితురాలు ఆర్యా బల్లావర్, ఆమె భర్త ఆశీష్, కజిన్ చైతన్యతో పాటు విషం సరఫరా చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన చేతులే హంతకులుగా మారడం చూసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Latest