Mahaa Daily Exclusive

  ఏఐ సిటీతో ప్రపంచానికి కేంద్రంగా తెలంగాణ..! హార్వర్డ్ వేదికగా ఏఐపై రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం…

Share

• రెండు వైపులా పదునైన కత్తిలాంటిది!

• హార్వర్డ్ వేదికగా ఏఐపై రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం.

బోస్టన్/ హైద్రాబాద్,మహా.

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ కొత్త సవాళ్లు ఎదురవ్వడం సహజమని, అయితే గతంలోని యంత్రాల వలె కాకుండా ఏఐకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండటమే ప్రధాన భయానికి కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్లేషించారు. శుక్రవారం అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం వేదికగా ప్రసంగించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఏర్పాటు చేసిన ‘కృత్రిమ మేధస్సు ’ ప్రత్యేక సదస్సులో ఆయన భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశ్రామిక విప్లవం మనిషి శారీరక శ్రమను తగ్గిస్తే, ఏఐ ఇప్పుడు మనిషి ఆలోచనా సామర్థ్యాన్ని సవాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది డాక్టర్లు, న్యాయవాదులు, రచయితలు వంటి వృత్తి నిపుణుల పనితీరులో మార్పులు తెస్తుందని, ప్రాథమిక స్థాయి ఉద్యోగాల సంఖ్య తగ్గవచ్చని పేర్కొన్నారు. అయితే, ఏఐ వల్ల కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని, దీనిని ఎదుర్కొనేందుకు పాలకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా, సాఫ్ట్‌వేర్, ఏరోస్పేస్ వంటి రంగాలకు గ్లోబల్ హబ్‌గా ఉందని, వైట్ కాలర్ ఉద్యోగాల రక్షణే తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సవాళ్లను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అనే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టిందని, అందులో భాగంగా ఒక భారీ ‘ఏఐ సిటీ’ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇది ఏఐ సంస్థలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకే చోట కల్పించే కేంద్రంగా నిలుస్తుందని, నగరానికి వెలుపల గ్రీన్ ఎనర్జీతో పనిచేసే డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఏఐ ప్రభావం తక్కువగా ఉండే గ్లోబల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వంటి రంగాల్లో యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. చైనాకు ప్రత్యామ్నాయంగా ‘చైనా+1’ వ్యూహంతో తెలంగాణను తయారీ రంగ కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్న వారికి పునఃశిక్షణ అందించేందుకు హార్వర్డ్ వంటి ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో కార్బన్ క్రెడిట్స్ తరహాలోనే, ఏఐ కంపెనీలకు ‘పీపుల్ క్రెడిట్స్’ విధానాన్ని అమలు చేయాలనే వినూత్న ఆలోచనను ఆయన సదస్సు ముందు ఉంచారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలకు నిలయమైన హైదరాబాద్‌లో ఏఐ, ఇన్ఫ్రా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. ఏఐ సాంకేతికతను నైతికంగా, బాధ్యతాయుతంగా వినియోగించుకుంటూ అందరికీ మేలు జరిగేలా చూడాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

Latest