- ఈ-కేవైసీ ఉంటేనే సిలిండర్ బుకింగ్!
- మార్చి 31లోగా ప్రక్రియ పూర్తి చేయాలని గడువు.
హైదరాబాద్, మహా.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితికి కేంద్ర ప్రభుత్వం పరిష్కార మార్గాలను అన్వేషిస్తోంది. యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయం కలగవచ్చనే ఊహాగానాలతో చాలామంది వినియోగదారులు అవసరం లేకపోయినా ముందస్తుగా సిలిండర్లను బుక్ చేస్తుండటంతో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. గతంలో బుక్ చేసిన రెండు రోజుల్లోనే ఇంటికి వచ్చే సిలిండర్, ఇప్పుడు కనీసం వారం రోజుల సమయం తీసుకుంటోంది. దేశంలో తగినన్ని గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మందకొడిగానే సాగుతోంది. ఈ క్రమంలో గ్యాస్ బుకింగ్ సేవలను మరింత పటిష్ఠం చేస్తూ, అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు కేంద్రం ‘ఈ-కేవైసీ’ని తప్పనిసరి చేసింది.
ఇప్పటివరకు కేవలం గ్యాస్ రాయితీ పొందేందుకు మాత్రమే పరిమితమైన ఈ-కేవైసీ ప్రక్రియను, ఇకపై గ్యాస్ బుక్ చేయాలన్నా పూర్తి చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం ఈ నెల 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. అప్పటిలోగా కేవైసీ పూర్తి చేయని వారు గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని, రాయితీని రెండింటినీ కోల్పోతారని హెచ్చరించింది. అయితే గతంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, చేయని వారు మాత్రం వెంటనే తమ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీలు లేదా మీ-సేవ కేంద్రాలను సంప్రదించి వేలిముద్రలు లేదా ఓటీపీ ద్వారా వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ అందుబాటులో ఉంటే మొబైల్ యాప్ ద్వారా కూడా ఉచితంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా వలస వెళ్లిన వారు, మరణించిన వారి పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లను కొందరు అక్రమార్కులు ఆసరాగా చేసుకుని సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకే ప్రతి ఏటా ఈ-కేవైసీని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు సైతం సంవత్సరానికి ఒకసారి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మరోవైపు, యుద్ధం సాకుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని లేదా కనెక్షన్ కట్ అవుతుందని వచ్చే నకిలీ వాట్సాప్ సందేశాలు, లింకుల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తక్షణ డెలివరీ పేరిట వచ్చే నకిలీ వెబ్‌సైట్లను నమ్మి వ్యక్తిగత వివరాలు, నగదు చెల్లించి మోసపోవద్దని, కేవలం అధికారిక మార్గాల ద్వారానే లావాదేవీలు జరపాలని అధికారులు కోరుతున్నారు.







