Mahaa Daily Exclusive

  అన్నదాతకు కేంద్రం అభయం….

Share

* ఎరువుల కొరత లేదని స్పష్టం.
* దేశంలో పాత ధరలకే సరఫరా..
* 61 లక్షల టన్నుల నిల్వలు సిద్ధం
* వానాకాలం కోటా కోసం కేంద్రానికి రాష్ట్రం విన్నపం.
* ముందస్తు నిల్వలపై మంత్రి తుమ్మల కసరత్తు.
హైదరాబాద్‌,మహా.
ప్రపంచం యుద్ధ భయంతో వణికిపోతున్నా, అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ముడిసరుకు ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. భారతీయ అన్నదాతకు మాత్రం సాగు పనుల్లో ఎరువుల ఢోకా లేదని కేంద్ర ప్రభుత్వం గట్టి భరోసా ఇచ్చింది. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నప్పటికీ, దేశీయంగా తగినన్ని నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు 12 శాతం నుంచి ఏకంగా 40 శాతం వరకు పెరిగినప్పటికీ, మన దేశంలో రైతుపై ఒక్క రూపాయి భారం కూడా పడకుండా పాత ధరలకే పంపిణీ చేస్తామని ప్రకటించడం రైతులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎరువుల నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 61.14 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే దాదాపు 6 లక్షల టన్నులు అదనం కావడం విశేషం. మరోవైపు దేశీయంగా ఎరువుల ఉత్పత్తి కూడా 23 శాతం వృద్ధి చెంది, రోజుకు 67,000 టన్నుల స్థాయికి చేరుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరఫరా మార్గాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, ఇటీవల ఓడరేవులకు 10 లక్షల టన్నుల యూరియా చేరుకోవడం గమనార్హం. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు దిగుమతుల అనుమతిని కేంద్రం పొడిగించడమే కాకుండా, ఎరువుల ప్లాంట్లకు సహజ వాయువు సరఫరాలో అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
అయితే, ముడిసరుకు దిగుమతుల విషయంలో భారత్ తన వ్యూహాన్ని మారుస్తోంది. సాధారణంగా మన దేశానికి అవసరమైన సహజ వాయువులో 41 శాతం ఖతార్ నుంచే వస్తుంది. అలాగే యూరియా దిగుమతుల్లో ఒమన్‌, సౌదీ అరేబియా, యూఏఈల వాటా అత్యధికం. యుద్ధం కారణంగా ఈ దేశాల నుంచి దిగుమతులు ఆగిపోవడంతో, కేంద్రం ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. రష్యా, మొరాకో, అమెరికా, కెనడా, నైజీరియా వంటి దేశాల నుంచి ఎరువులు, గ్యాస్‌ కొనుగోలు చేసేందుకు ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. మే నెల వరకు నిల్వలు సరిపోయినా, జూన్ నుంచి పెరిగే డిమాండ్‌ను తట్టుకోవడానికి ఈ ముందస్తు ఒప్పందాలు కీలకం కానున్నాయి.
రాష్ట్రాల వారీగా చూస్తే, తెలంగాణ ప్రభుత్వం రాబోయే వానాకాలం సీజన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం, సీజన్ ముందుగానే ప్రారంభం కానుండటంతో దాదాపు 10.50 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేశారు. గత ఏడాది ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండటానికి ఏప్రిల్‌ నుంచే బఫర్‌ స్టాక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాస్తూ.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతి నెలా 2 లక్షల టన్నుల చొప్పున కోటాను కేటాయించాలని కోరారు. కేవలం రసాయన ఎరువులపైనే ఆధారపడకుండా, నేల సారాన్ని కాపాడేందుకు నానో యూరియా మరియు జీవ ఎరువుల వాడకాన్ని క్షేత్రస్థాయిలో ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అన్నదాతకు అండగా నిలిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అడుగులు వేస్తున్నాయి.

Latest