Mahaa Daily Exclusive

  అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహార భాగ్యం..! ‘తొలి ముద్ద’కు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..

Share

  • అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహార భాగ్యం..
  • ‘తొలి ముద్ద’కు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం.
  •  కిచిడీ, ఉప్మా మిక్స్‌లతో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.
  •  అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీ.
  •  అద్దె భవనాల నుంచి విముక్తి..
  •  సొంత గూడు దిశగా అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం భరోసా.

హైదరాబాద్‌,మహా.

“రాష్ట్రంలోని అంగన్వాడీ చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. కేవలం ఆకలి తీర్చడమే కాకుండా, బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించడమే లక్ష్యంగా ‘తొలి ముద్ద’ పేరుతో సరికొత్త బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు.” అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో కలిసి ముఖ్యమంత్రి ఈ పథకానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు విధి నిర్వహణలో తోడ్పాటునందించేలా ఆధునిక మొబైల్ ఫోన్లను కూడా ఆయన పంపిణీ చేశారు. అంగన్వాడీ చిన్నారులను తమ సొంత బిడ్డల్లా భావించి, వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించే గురుతర బాధ్యత అంగన్వాడీ సిబ్బందిపై ఉందని సీఎం గుర్తు చేశారు.

పథకం వివరాలను వెల్లడిస్తూ, చిన్నారులకు ఎంతో ఇష్టమైన మరియు బలవర్ధకమైన ఉప్మా, కిచిడీ మిక్స్‌లను (రెడీ టు కుక్) బ్రేక్ ఫాస్ట్‌గా అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దేశ చరిత్రలో గత పాలకుల ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ, తొలి ప్రధాని నెహ్రూ హయాంలో నిరక్షరాస్యత నిర్మూలనకు విద్యకు, వ్యవసాయాభివృద్ధికి సాగునీటి రంగానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఆ ప్రయత్నాల ఫలితంగా దేశంలో నేడు ఆహార భద్రత చేకూరిందని, కానీ పౌష్టికాహార భద్రత విషయంలో ఇంకా మనం వెనుకబడే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పౌష్టికాహారం అందించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన తమ ప్రభుత్వం, ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ పథకంతో ఆ లోటును భర్తీ చేస్తోందని వివరించారు. ఆరేళ్లలోపు పిల్లలకు సరైన పోషకాలు అందినప్పుడే వారిలో శారీరక, మానసిక ఎదుగుదల సక్రమంగా ఉంటుందని, భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలను ఆదిలోనే అడ్డుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

అంగన్వాడీ సిబ్బంది సంక్షేమంపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లను ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తోందని, వారి సమస్యలపై నిరంతరం చర్చిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ఏ పథకమైనా క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలంటే అంగన్వాడీల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కలిగిన వెంటనే ప్రాధాన్యతా క్రమంలో అంగన్వాడీల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు అందించిన మొబైల్ ఫోన్లు వారి పనితీరును మెరుగుపరచడమే కాకుండా, పథకాల అమలులో పారదర్శకతకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాల విషయంలో ముఖ్యమంత్రి అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అనేక అంగన్వాడీ కేంద్రాలు ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదని, ప్రతి కేంద్రానికి సొంత భవనం ఉండేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన నిధులను సమీకరించి, యుద్ధప్రతిపాదికన భవన నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఫహీం, చైల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ సీతా దయాకర్ రెడ్డి , ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest