Mahaa Daily Exclusive

  క్రికెట్‌ను ఆస్వాదించండి..! జీవితాలను పణంగా పెట్టకండి.. యువతకు సీపీ సజ్జనార్ హెచ్చరిక..

Share

  • క్రికెట్‌ను ఆస్వాదించండి.
  •  జీవితాలను పణంగా పెట్టకండి..
  • ఐపీఎల్ ‘పరుగుల’ పండుగ..
  •  సే నో టు బెట్టింగ్ యాప్స్’ నినాదం.
  •  ఆన్‌లైన్ జూదంపై పోలీసుల ఉక్కుపాదం.
  •  యువతకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్‌,మహా.

“క్రికెట్ అనేది కోట్లాది మంది భారతీయులకు ఒక భావోద్వేగం.. అదొక పరుగుల పండుగ. అయితే, ఈ క్రీడా స్ఫూర్తిని ఆస్వాదించాల్సిన యువత, బెట్టింగ్ అనే మాయాజాలంలో చిక్కుకుని తమ ఉజ్వల భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకోవద్దు. ఐపీఎల్ మ్యాచ్‌లను కేవలం వినోదంగా చూడాలే తప్ప, క్షణికావేశంలో వేసే బెట్టింగ్‌లతో జీవితాలను నిప్పుల గుండంగా మార్చుకోవద్దు” అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ అత్యంత తీవ్రంగా హెచ్చరించారు. శనివారం నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, బెట్టింగ్ యాప్‌లు మరియు ఆన్‌లైన్ జూదంపై యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ప్రారంభించిన ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రజా ఉద్యమం అద్భుత ఫలితాలను ఇచ్చిందని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా బెట్టింగ్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ నేడు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే హోరాహోరీ పోరుతో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, భద్రతాపరమైన ఇబ్బందులు తలుత్తకుండా బీసీసీఐ అత్యంత పకడ్బందీగా 70 లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మే 24 వరకు సాగే ఈ సుదీర్ఘ టోర్నీలో వినోదంతో పాటు, బెట్టింగ్ అనే ముప్పు కూడా పొంచి ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివేదికల ప్రకారం దేశంలో రోజుకు సుమారు 14 కోట్ల మంది ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారని, ముఖ్యంగా ఐపీఎల్ సమయంలోనే యువత ఈ వ్యసనానికి ఎక్కువగా బానిసలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ అక్రమ దందాను అరికట్టేందుకు ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. సోషల్ మీడియా, టెలిగ్రామ్ వంటి వేదికల ద్వారా నేరగాళ్లు అమాయక యువతకు గాలం వేస్తున్నారని సీపీ సజ్జనార్ వివరించారు. ప్రభుత్వం ఇప్పటికే వందలాది బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించినప్పటికీ, కొత్త కొత్త పేర్లతో ఇవి పుట్టుకొస్తూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కాసులకు ఆశపడి కొంతమంది సినీ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేయడం సిగ్గుచేటని, అటువంటి వారిపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసి విచారణ చేపడుతోందని గుర్తు చేశారు. డబ్బు కోసం యువత జీవితాలతో ఆడుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్‌లు నిర్వహించే ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన స్పష్టం చేశారు.

ఆన్‌లైన్ జూదం ద్వారా దేశంలో ఏటా సుమారు రూ. 8.50 లక్షల కోట్లకు పైగా అక్రమంగా చేతులు మారుతున్నట్లు అంచనా. ఈ ఆర్థిక విధ్వంసాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో ‘ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్, 2025’ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం నగదుతో ముడిపడిన ఆన్‌లైన్ గేమింగ్‌ను పూర్తిగా నిషేధించడమే కాకుండా, జూదాన్ని ప్రోత్సహిస్తున్న సుమారు 8 వేల వెబ్సైట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిరుద్యోగులు, విద్యార్థులు ఈ బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని అప్పుల పాలు కావడమే కాకుండా, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా తమ పరిసరాల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించి, సమాజ సంరక్షణలో భాగస్వాములు కావాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.

Latest