Mahaa Daily Exclusive

  కశ్మీరీ పండిట్ల భూములకు విముక్తి..! హక్కుదారులకు 466 ఎకరాల అప్పగింత..

Share

  •  హక్కుదారులకు 466 ఎకరాల అప్పగింత.
  •  అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక ప్రకటన.
  •  ఆక్రమణల నుంచి స్వాధీనం.. బాధితుల నిరీక్షణకు దక్కిన ఫలితం.

 

శ్రీనగర్ ,మహా.

“జమ్మూకశ్మీర్ లోయలో దశాబ్దాలుగా వేచి చూస్తున్న కశ్మీరీ పండిట్ల నిరీక్షణకు ఎట్టకేలకు న్యాయం జరుగుతోంది. వారి పూర్వీకుల భూములను ఆక్రమణల నుంచి విముక్తి కలిగించి, అసలైన హక్కుదారులకు అప్పగించే ప్రక్రియలో ప్రభుత్వం కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు లోయలో కశ్మీరీ పండిట్లకు చెందిన 466.15 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, దానిపై పూర్తి హక్కులను మళ్లీ వారికే కట్టబెట్టిందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం వెల్లడించారు.” శనివారం జమ్మూకశ్మీర్ శాసనసభలో ప్రశ్నపత్తర సమయంలో బీజేపీ ఎమ్మెల్యే యుధ్‌వీర్ సేథీ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఈ వివరాలను సభ ముందుంచారు. లోయలో శాంతిని పునరుద్ధరించడంతో పాటు, నిర్వాసితులైన పండిట్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు భూములను తిరిగి అప్పగించడం ఒక ప్రధాన అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.

ముఖ్యమంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఈ భూముల స్వాధీన ప్రక్రియ గత కొన్నేళ్లుగా దశలవారీగా సాగుతోంది. 2023 డిసెంబరు నాటికే ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి సుమారు 365.5 ఎకరాల భూమిని గుర్తించి హక్కుదారులకు అప్పగించినట్లు ఆయన గుర్తు చేశారు. ఇక 2024 నవంబరు నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశామని, ఈ స్వల్ప కాలంలోనే అదనంగా 105.525 ఎకరాల భూమిని ఆక్రమణదారుల నుంచి విముక్తి చేసి పండిట్లకు అప్పగించినట్లు వివరించారు. ఈ విధంగా ప్రభుత్వ చొరవతో ఇప్పటివరకు మొత్తం 466.15 ఎకరాల భూమి బాధితుల చేతికి చేరిందని తెలిపారు. లోయ నుంచి వలస వెళ్లిన వారు తిరిగి తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు, వారి ఆస్తుల భద్రతకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒమర్ అబ్దుల్లా ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ఈ భూముల గుర్తింపు మరియు స్వాధీనం కోసం ప్రభుత్వం ప్రత్యేక రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసిందని, వివాదాస్పదంగా ఉన్న భూములను రికార్డుల ఆధారంగా పరిశీలించి పారదర్శకంగా హక్కుదారులకు కట్టబెడుతున్నట్లు సమాచారం. దశాబ్దాల క్రితం అనివార్య పరిస్థితుల్లో లోయను వదిలి వెళ్లిన కశ్మీరీ పండిట్ల ఆస్తులు చాలా చోట్ల అక్రమ ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు, చట్టబద్ధంగా బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ వివరణ పట్ల నిర్వాసిత కుటుంబాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. తమ భూములను తిరిగి పొందడం ద్వారా లోయతో మళ్లీ పేగు బంధం బలపడుతుందని పలువురు పండిట్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest