Mahaa Daily Exclusive

  మాతృ మరణాల నిష్పత్తిలో భారత్ రికార్డు..!

Share

  • మూడు దశాబ్దాల్లో 80 శాతం తగ్గుదల.
  • లక్ష ప్రసవాలకు 116 మరణాలు మాత్రమే.
  •  ‘ది లాన్సెట్’ అధ్యయనంలో వెల్లడి.
  •  ఐరాస లక్ష్యం ‘70’కి చేరువగా భారత్.

ఢిల్లీ , మహా.

“భారతదేశంలో మాతృత్వానికి భరోసా పెరుగుతోంది. ఒకప్పుడు ప్రసవం అంటే ప్రాణసంకటంగా భావించే పరిస్థితుల నుంచి, నేడు సురక్షిత ప్రసవాల దిశగా దేశం అద్భుతమైన ప్రగతిని సాధించింది. గత మూడు దశాబ్దాల కాలంలో ప్రసూతి మరణాల నిష్పత్తిని భారత్ ఏకంగా 80 శాతం మేర తగ్గించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. 1990లో ప్రతి లక్ష ప్రసవాలకు 508 మంది తల్లులు మరణించగా, 2023 నాటికి ఆ సంఖ్య 116కు పడిపోవడం విశేషం.” అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్’ ప్రచురించిన తాజా అధ్యయన నివేదిక ఈ ఆశాజనకమైన మార్పును వెల్లడించింది. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ పరిశోధకులు 204 దేశాల్లో నిర్వహించిన సమగ్ర విశ్లేషణలో భారత్ సాధించిన ఈ ఘనత వెలుగులోకి వచ్చింది.

నివేదిక ప్రకారం, 2023 సంవత్సరంలో భారత్‌లో మొత్తం 24,700 ప్రసూతి మరణాలు సంభవించాయి. ఇతర దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, జనాభా ప్రాతిపదికన చూస్తే మరణాల నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. అదే ఏడాదిలో నైజీరియాలో అత్యధికంగా 32,900 మరణాలు చోటుచేసుకోగా, ఇథియోపియాలో 11,900, పాకిస్థాన్‌లో 10,300 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 1990లో ప్రతి లక్ష ప్రసవాలకు 321 మరణాలు సంభవించగా, 2023 నాటికి అది 190.5కు తగ్గింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ప్రపంచ సగటు తగ్గుదల 48 శాతంగా ఉంటే, భారత్ మాత్రం ఏకంగా 86 శాతం (కేంద్ర వర్గాల లెక్కల ప్రకారం) మేర మరణాలను నియంత్రించి అగ్రగామిగా నిలిచింది.

భారత హోంశాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే ఫలితాలు కూడా ఇదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. 2021-2023 ఎస్‌ఆర్ఎస్ స్పెషల్ బులెటిన్ ప్రకారం దేశంలో మాతృ మరణాల నిష్పత్తి మరింత తగ్గి 88కి చేరుకుంది. 2014-2016 కాలంలో ఇది 130గా ఉండటం గమనార్హం. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రకారం 2030 నాటికి ఈ నిష్పత్తిని 70 కంటే తక్కువకు తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుత పురోగతిని బట్టి చూస్తే భారత్ నిర్ణీత గడువు కంటే ముందే ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ప్రసూతి మరణాలకు గల కారణాలను విశ్లేషించిన పరిశోధకులు ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. ప్రసవ సమయంలో లేదా తర్వాత జరిగే ‘అధిక రక్తస్రావం’ గర్భధారణ సమయంలో తలెత్తే ‘అధిక రక్తపోటు’ కారణంగానే అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు. కొవిడ్-19 వ్యాప్తి చెందిన తొలినాళ్లలో ఈ మరణాలు కొంత పెరిగినప్పటికీ, ఆ తర్వాత ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చిందని నివేదిక స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడం, ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం వంటి ప్రభుత్వ చర్యలు ఈ సానుకూల మార్పుకు కారణమయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Latest