- ‘నా చేతిలో తుపాకీ ఉంటే కాల్చేసేవాడిని’..
- చంద్రబాబుకు జరిగిన అవమానంపై మంత్రి గర్జన.
- అమరావతికి చట్టబద్ధ భరోసా.. మళ్లీ ‘వైకుంఠపాళి’ వద్దని ప్రజలకు విజ్ఞప్తి.
అమరావతి , మహా.
“ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం అత్యంత భావోద్వేగ క్షణాలకు సాక్ష్యంగా నిలిచింది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన ప్రసంగం సభను ఉర్రూతలూగించడమే కాకుండా, సభ్యుల కళ్లను చెమ్మగిల్లేలా చేసింది. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తమపై జరిగిన వ్యక్తిగత దాడులు, అవమానాలను గుర్తుచేసుకున్న ఆయన.. ఆ రోజుల్లో తాను అనుభవించిన మనోవేదనను పదునైన మాటలతో వెళ్లగక్కారు. ‘చంద్రబాబు ని, మమ్మల్ని అనరాని మాటలు అంటుంటే.. నా చేతిలో గనుక అప్పుడు తుపాకీ ఉంటే కాల్చిపడేయాలి అనిపించేంత కోపం, ఆవేదన కలిగాయి’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్న తీరు సభలో పెను సంచలనం సృష్టించింది.”
**ప్రజాస్వామ్యానికి ఆ రోజు చీకటి రోజు!**
మూడు రాజధానుల బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టిన 2020, జనవరి 21వ తేదీని ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజుగా అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ఆనాడు వైఎస్సార్సీపీ నేతలు సాగించిన అరాచకాలను ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. మండలిలో వైకాపాకు బలం లేకపోయినప్పటికీ, అడ్డగోలుగా బిల్లును నెగ్గించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా మండలిలోకి ప్రవేశించి రభస సృష్టించారని గుర్తుచేశారు. లైట్లు ఆపివేసి, టీవీ ప్రసారాలు నిలిపివేసి, చైర్మన్ షరీఫ్ గారి ఛాంబర్‌ను ముట్టడించి ఒత్తిడి తెచ్చిన ఉదంతాలను ఆయన ఎండగట్టారు. అటువంటి గడ్డు పరిస్థితుల్లోనూ చంద్రబాబు గారు ఎంతో ఓపికతో నిలబడ్డారని, ఆయన ధైర్యమే తమను ఇక్కడి వరకు నడిపించిందని నివాళులర్పించారు.
**2019 ఎన్నికలు.. ఒక చారిత్రక తప్పిదం!**
గత ఎన్నికల ఫలితాలపై అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ‘స్వర్ణయుగం’లా సాగిందని, అటువంటి సమయంలో ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచుకుని, జైలుకు వెళ్లిన వ్యక్తిని నమ్మి ఓటేయడం ద్వారా ప్రజలు చారిత్రక తప్పిదం చేశారని విమర్శించారు. జగన్ పాలనలో ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టారే తప్ప ఒక్క ఇటుక కూడా వేయలేదని దుయ్యబట్టారు. విశాఖను రాజధాని చేస్తామని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు.
**అమరావతికి తిరుగులేని చట్టబద్ధత!**
రాజధాని నిర్మాణానికి చంద్రబాబు గారే కర్త, కర్మ, క్రియ అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఎవరైనా అనాలోచితంగా రాజధానిని మార్చాలని చూస్తే అది సాధ్యం కాకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. “ప్రజలారా.. మళ్లీ ప్రలోభాలకు లొంగి వైకుంఠపాళి ఆట ఆడొద్దు. ఈ రాష్ట్రాన్ని బాగుచేసే సత్తా చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మాత్రమే ఉంది. మమ్మల్ని ఆశీర్వదించండి” అని ఆయన చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.







