Mahaa Daily Exclusive

  రైలు ప్రయాణంలో ‘కార్పొరేట్’ సేవలు..! రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. ప్రతి జోన్‌లో 5 రైళ్లతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం..

Share

  • పట్టాలెక్కనున్న శిక్షణ పొందిన అటెండెంట్లు!
  •  దుప్పట్ల పంపిణీ నుంచి టెక్నికల్ రిపేర్ల వరకు అన్నీ వారే.
  •  రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. ప్రతి జోన్‌లో 5 రైళ్లతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం.

 

ఢిల్లీ, మహా.

“భారతీయ రైల్వేలో ప్రయాణం అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడం మాత్రమే కాదు.. అది ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిశ్చయించుకుంది. రైలు ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ప్రయాణికులకు ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతూ, ఆన్‌బోర్డ్ సేవల కోసం ప్రత్యేకంగా ‘శిక్షణ పొందిన అటెండెంట్లను’ నియమించాలని నిర్ణయించింది. ఇకపై ఏసీ కోచ్‌లలో కనిపించే అటెండెంట్లు కేవలం దుప్పట్లు ఇచ్చే వ్యక్తులుగా మాత్రమే కాకుండా, ప్రయాణికుల సమస్యలను ఇట్టే చక్కదిద్దే ‘స్మార్ట్’ సిబ్బందిగా దర్శనమివ్వనున్నారు.”

ప్రస్తుతం రైళ్లలో కొనసాగుతున్న ఆన్‌బోర్డ్ హౌస్‌కీపింగ్ వ్యవస్థపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా బెడ్ రోల్స్ అపరిశుభ్రత, టాయిలెట్ల నిర్వహణ లోపం, సిబ్బంది ప్రవర్తనపై ‘రైల్ మదద్’ పోర్టల్‌లో వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను రైల్వే శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ సమస్యలకు ప్రధాన కారణం సిబ్బందికి సరైన వృత్తి నైపుణ్యం, విద్యార్హత లేకపోవడమేనని గుర్తించిన ప్రభుత్వం, ఇకపై కనీసం 12వ తరగతి ఉత్తీర్ణులైన, నైపుణ్యం కలిగిన యువతను అటెండెంట్లుగా నియమించనుంది. వీరు కేవలం విధులను నిర్వర్తించడమే కాకుండా, తమకు కేటాయించిన కోచ్‌లకు ‘సూపర్‌వైజర్లు’గా కూడా వ్యవహరిస్తారు.

 

**బహుముఖ ప్రజ్ఞాశాలలుగా అటెండెంట్లు**

 

కొత్తగా నియమితులయ్యే ఈ అటెండెంట్లకు రైల్వే శాఖ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. వీరి బాధ్యతలు కేవలం శుభ్రతకే పరిమితం కావు. ప్రయాణంలో తరచూ ఇబ్బంది పెట్టే చిన్నపాటి సాంకేతిక సమస్యలను కూడా వీరు పరిష్కరిస్తారు. కోచ్‌లలో లైట్లు వెలగకపోయినా, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు పని చేయకపోయినా ఇకపై ఎలక్ట్రీషియన్ కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు. అటెండెంట్లే వాటిని సరిచేస్తారు. ప్రయాణికులు అడిగే వరకు వేచి చూడకుండా, వారి అవసరాలను ముందస్తుగా గుర్తించి సేవలు అందిస్తారు. ప్రయాణికులు సులభంగా గుర్తించేలా వీరికి ప్రత్యేకమైన, హుందాతో కూడిన యూనిఫాంలను కేటాయిస్తారు.

 

**తొలి దశలో ఐదు రైళ్లతో శ్రీకారం**

 

ఈ నూతన విధానాన్ని భారతీయ రైల్వే ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. మొదటగా ప్రతి రైల్వే జోన్‌లో అత్యంత రద్దీగా ఉండే ఐదు రైళ్లను ఎంపిక చేసి, ఈ శిక్షణ పొందిన అటెండెంట్లను రంగంలోకి దించుతారు. అక్కడ వచ్చే ఫలితాలను, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించిన తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైళ్లకు ఈ సేవలను విస్తరించాలని రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ నిర్ణయంపై ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రైళ్లలో విద్యావంతులైన సిబ్బంది ఉండటం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతుందని, ప్రయాణం మరింత సుఖమయంగా మారుతుందని ప్యాసింజర్లు అభిప్రాయపడుతున్నారు.

Latest