- హైడ్రా పేరిట పేదలపై ప్రతాపమా?..
- సామాజిక బహిష్కరణకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రిపై సబితా ఆగ్రహం.
హైదరాబాద్ ,మహా.
తెలంగాణ రాజకీయాలు శనివారం నాటి అసెంబ్లీ సమావేశాలతో మరింత వేడెక్కాయి. ముఖ్యంగా ‘మూసీ’ సుందరీకరణ మరియు ‘హైడ్రా’ కూల్చివేతల చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పరాకాష్టకు చేరింది. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చేసి చరిత్రలో నిలవాలని తహతహలాడుతున్నారు.. అయితే వేల ఇళ్లు కూల్చిన సీఎంగా మిగిలిపోతారా? లేక ఒక్క పేదవాడి గూడు కూడా చెదరనివ్వని నేతగా నిలుస్తారా అనేది త్వరలోనే తేలుతుంది” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజలు ఓట్లేసింది ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని కానీ, మూసీ పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీకి కాదని ఆయన ధ్వజమెత్తారు.
మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు. “ప్రతిపక్షాలను సామాజిక బహిష్కరణ చేస్తామంటున్న సీఎం, ప్రజలు మిమ్మల్ని బహిష్కరించే రోజు దగ్గరలోనే ఉందని గుర్తుంచుకోవాలి” అని హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టు కోసం 10 వేల ఇళ్లను కూల్చే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ గందరగోళం మధ్యే, మెట్రో రెండో దశ విస్తరణకు ఉద్దేశించిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.







