- మైదానంలో ప్రజాప్రతినిధుల కేరింతలు.
- పద్నాలుగేళ్ల తర్వాత పునరుద్ధరించిన క్రీడా సంప్రదాయం!
- 2034 ఒలింపిక్సే లక్ష్యం.. గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధికి రూ. 700 కోట్లు.
- సీఎం రేవంత్ రెడ్డి.
- ఎల్‌బీ స్టేడియంలో ‘లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్’ ప్రారంభం.
హైదరాబాద్,మహా.
“హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చారిత్రక ఎల్‌బీ స్టేడియం సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ క్రీడాస్ఫూర్తికి వేదికైంది. నాయకులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉంటుందనే ‘ఫిట్ లీడర్స్ – ఫిట్ స్టేట్’ సందేశంతో ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్, కల్చరల్ మీట్’ మొదటి ఎడిషన్ అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. బడ్జెట్ సమావేశాల వేళ శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం గత 14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ క్రీడా సంప్రదాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం స్వయంగా శ్రీకారం చుట్టారు. కేవలం ప్రారంభోత్సవానికే పరిమితం కాకుండా, మైదానంలోకి దిగి ఫుట్‌బాల్ ఆడుతూ సహచర మంత్రులు, ఎమ్మెల్యేలలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.”
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎల్‌బీ స్టేడియానికి ఉన్న గొప్ప చరిత్రను గుర్తుచేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎందరో క్రీడాకారులు ఈ మైదానంలో ఆడి శిక్షణ పొందారని, అటువంటి ఈ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గచ్చీబౌలి క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి రూ. 700 కోట్లు కేటాయిస్తున్నామని, మరో మూడు నెలల్లోనే అక్కడ పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. 2034 ఒలింపిక్స్‌ను గచ్చీబౌలిలో నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని, రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రధాన క్రీడలన్నింటినీ అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బేగంపేట హాకీ మైదానాన్ని సైతం ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.
నగరపు క్రీడా నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ 1950-60 దశకంలో భారత ఫుట్‌బాల్ జట్టు ప్రపంచస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచినప్పుడు, ఆ జట్టులో ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్ నగరానికి చెందినవారే ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఒకప్పుడు హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్‌లో వెలిగిపోయిన మన నగరం ఇప్పుడు క్రీడల్లో కొంత వెనుకబడిందని, ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలు పూర్తిగా కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర క్రీడా పాలసీని తీసుకువచ్చామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ‘సీఎం కప్’ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రపంచ క్రీడా యవనికపై దక్షిణ కొరియా వంటి దేశాలు చూపిస్తున్న పట్టుదలను మనం అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ మనం ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నామని, దక్షిణ కొరియా గెలిచిన 30 స్వర్ణ పతకాల్లో 16 పతకాలు అక్కడి ఒకే ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ సాధించిందని గుర్తుచేశారు. క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు ఆహ్వానించామని వెల్లడించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని, ప్రతి ఒక్కరూ క్రీడలపైన ఆసక్తి పెంచుకోవాలని కోరారు. ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొనడం స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.







