Mahaa Daily Exclusive

  మారణహోమం వద్దు.. శాంతియే ముద్దు. . ప్రొఫెసర్‌ కోదండరాం.

Share

  •  నేడు చార్మినార్‌ నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వరకు యుద్ధ వ్యతిరేక ర్యాలీ.

 

హైదరాబాద్‌, మహా .

“పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు ప్రపంచ మానవాళి ఉనికికే ముప్పుగా పరిణమిస్తున్నాయని, ఈ వినాశకర పోకడలను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ శాంతి గళం విప్పాలని ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికాల మధ్య సాగుతున్నది కేవలం దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదని, అది చమురు, ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు అమెరికా సామ్రాజ్యవాద దృక్పథంతో సాగిస్తున్న అన్యాయమైన మారణహోమమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఆదివారం ఉదయం 10:30 గంటలకు చార్మినార్‌ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వరకు భారీ ‘యుద్ధ వ్యతిరేక ర్యాలీ’ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ శాంతి యాత్రను విజయవంతం చేసి అంతర్జాతీయ సమాజానికి బలమైన సందేశం పంపాలని కోరారు.”

అమెరికా తన ఆధిపత్య వైఖరితో గతంలో ఇరాక్, వెనిజులా దేశాలను అస్థిరపరిచిందని, ఇప్పుడు అదే జాత్యహంకార ధోరణితో ఇరాన్‌పై దాడులకు దిగుతోందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. వనరుల వేటలో భాగంగా ప్రారంభమైన ఈ యుద్ధం నూతన వలసవాద భావజాలంతో సాగుతోందని దుయ్యబట్టారు. యుద్ధం ఇలాగే కొనసాగితే వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ప్రపంచం మరో తీవ్ర ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుంటుందని హెచ్చరించారు. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన ఏకపక్ష సుంకాల వల్ల కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, తాజా యుద్ధ పరిణామాలతో పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్, నెతన్యాహు ద్వయం ఎటువంటి కారణం లేకుండా సాగిస్తున్న ఈ ఘర్షణలు ప్రపంచ శాంతికి గొడ్డలిపెట్టుగా మారాయని విమర్శించారు.

ముఖ్యంగా భారతదేశం వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఈ యుద్ధం పెను సవాలుగా మారిందని కోదండరాం విశ్లేషించారు. పెట్రోల్, గ్యాస్‌ ధరల పెరుగుదల వల్ల సామాన్యుల జీవితాలు దుర్భరమవుతున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పేర్కొన్నారు. యుద్ధ ప్రభావం వల్ల దేశంలోని చిన్న వ్యాపారాలు, హోటళ్లు మూతపడి ఉపాధి దెబ్బతింటోందని చెప్పారు. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న సుమారు 15 లక్షల మంది తెలంగాణ కార్మికులతో పాటు, కోటి మందికి పైగా భారతీయుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకమైందని గుర్తుచేశారు. ఈ భయానక పరిస్థితుల దృష్ట్యా భారత్ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కాకుండా, అలీనోద్యమ స్ఫూర్తితో శాంతి స్థాపనకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

Latest