ఢిల్లీ, మహా.
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి శాశ్వత ప్రాతిపదికన చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ఊపందుకుంది. ఈ దిశగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయి అత్యంత కీలకమైన సంప్రదింపులు జరిపారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అవసరమైన సవరణలు చేసి, అమరావతి బిల్లుకు మోక్షం కలిగించాలని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా గట్టిగా కోరారు. రాజధాని విషయంలో భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ సందిగ్ధతకు తావులేకుండా ఒక సుస్థిరమైన, శాశ్వత పరిష్కారం చూపాల్సిన ఆవశ్యకతను ఆయన హోంమంత్రికి వివరించారు.
అమరావతికి చట్టపరమైన రక్షణ కల్పించడం ద్వారానే రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాది పడుతుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చే ప్రయత్నాలు జరగకుండా ఉండాలంటే కేంద్రం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, తద్వారా రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన వేలాది మంది రైతులకు మరియు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపే పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి భరోసా లభిస్తుందని నొక్కిచెప్పారు. అమరావతి రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని, దీనిపై ఇక ఎంతమాత్రం జాప్యం చేయడం తగదని ఆయన విజ్ఞప్తి చేశారు.
వెంకయ్య నాయుడు చేసిన ప్రతిపాదనల పట్ల అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అమరావతికి సంబంధించిన బిల్లు ముసాయిదాపై కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిందని, త్వరలోనే దీనిని తుది ఆమోదం కోసం కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. రాజధాని అంశంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన మరిన్ని కీలక ప్రయోజనాలపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదల, విభజన చట్టంలోని పెండింగ్ హామీల అమలు వంటి అంశాలను వెంకయ్య నాయుడు హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని అమిత్ షా భరోసా ఇవ్వడంతో అమరావతికి చట్టబద్ధత దిశగా అడుగులు పడినట్లయింది.








