Mahaa Daily Exclusive

  నర్సంపేటలో స్కానింగ్ సెంటర్ నిర్లక్ష్యం: తప్పుడు రిపోర్టుతో బాలిక కుటుంబానికి తీరని మనోవేదన!

Share

నర్సంపేటలో స్కానింగ్ సెంటర్ నిర్వాకం.
* తప్పుడు నివేదికతో బాలిక కుటుంబానికి తీవ్ర మనోవేదన
నర్సంపేట, మహా.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఒక స్కానింగ్ సెంటర్ చేసిన అత్యుత్సాహం, నిర్లక్ష్యం ఒక నిండు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని, గందరగోళాన్ని నింపింది. కడుపునొప్పితో చికిత్స కోసం వచ్చిన ఒక చిన్నారికి తప్పుడు వైద్య నివేదిక ఇచ్చి, ఆ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్కానింగ్ సెంటర్ ఇచ్చిన నివేదికలో అసత్యాలు ఉన్నాయని తేలడంతో ఆగ్రహించిన బాధితులు సదరు కేంద్రంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
వివరాల్లోకి వెళితే.. నర్సంపేట పట్టణానికి చెందిన ఒక బాలిక గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన సిబ్బంది, ఆ బాలిక గర్భం దాల్చినట్లు నివేదిక ఇచ్చారు. ఈ వార్త విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమ కుమార్తె విషయంలో ఇటువంటి రిపోర్టు రావడంపై అటు సమాజంలో తలెత్తుకోలేక, ఇటు పరువు పోయిందని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయితే, ఆ రిపోర్టుపై అనుమానం కలిగిన వారు నిర్ధారణ కోసం వరంగల్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌ను ఆశ్రయించారు.
అక్కడ నిపుణులైన వైద్యులు బాలికకు తిరిగి పరీక్షలు నిర్వహించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక గర్భవతి కాదని, ఆమె గర్భాశయంలో ఒక చిన్న కణితి (టిష్యూ గ్రోత్) ఏర్పడటం వల్లే కడుపునొప్పి వస్తోందని వైద్యులు తేల్చి చెప్పారు. అనంతరం శస్త్రచికిత్స చేసి ఆ కణితిని విజయవంతంగా తొలగించారు. దీంతో తమ బిడ్డపై పడ్డ నింద తొలిగిపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, నర్సంపేట స్కానింగ్ సెంటర్ చేసిన తప్పిదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు, వారి బంధువులు పెద్ద సంఖ్యలో స్కానింగ్ సెంటర్‌కు చేరుకుని అక్కడి సిబ్బందిని నిలదీశారు.
తమ కుటుంబం పరువు తీయడమే కాకుండా, చిన్నారిని మానసిక క్షోభకు గురిచేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న నర్సంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు పక్షాలను శాంతింపజేశారు. ఈ వ్యవహారంపై ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వైద్య నివేదికల ఆధారంగా లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న ఇటువంటి తప్పుడు రిపోర్టులు ఇచ్చే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Latest