కాళేశ్వరం పాపంలో కేసీఆర్‌దే బాధ్యత.
• పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో కేసీఆర్ బండారం బయటపడింది.
* లక్ష కోట్ల దోపిడీకి కేసీఆరే సూత్రధారి..
* దోషులు ఎవరైనా శిక్ష తప్పదు: ముఖ్యమంత్రి హెచ్చరిక
హైదరాబాద్, మహా.
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ప్రత్యక్ష బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టంగా తేలినప్పటికీ, ఆయనపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో సీఎం సుదీర్ఘంగా ప్రసంగిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరిట జరిగిన భారీ దోపిడీకి అసలు సూత్రధారి ఎవరో విచారణ నివేదిక కళ్లకు కడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించి నెలలు గడుస్తున్నా, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో కదలిక లేకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు రూపకల్పన నుంచి బ్యారేజీల నిర్మాణం వరకు ప్రతి చిన్న నిర్ణయం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని, ప్రతి ఫైలుపై ఆయనే స్వయంగా సంతకం చేశారని సీఎం గుర్తు చేశారు. ప్రతి ఇంజనీర్‌కు నేరుగా ఆదేశాలిచ్చిన వ్యక్తిని వదిలేసి, కేవలం అధికారులను మాత్రమే బాధ్యులను చేసి కేసీఆర్ తప్పించుకోవడం సాధ్యమేనా అని ఆయన నిలదీశారు. ఈ విషయంలో కేంద్ర విచారణ సంస్థలు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నాయో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల సంపదను దాదాపు లక్ష కోట్లు కొల్లగొట్టి, చివరకు కొత్తగా లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందించలేకపోయారని మండిపడ్డారు.
అంచనాల పెంపు వల్ల రాష్ట్రంపై అప్పుల భారం పెరగడమే కాకుండా, మేడిగడ్డ వంటి కీలక నిర్మాణాలు కుంగిపోవడంతో ప్రాజెక్టు ఉనికికే ముప్పు వాటిల్లిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు దూరం కాబట్టే నిష్పక్షపాత విచారణ కోసం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రమేయం ఉన్నందునే ఈ కేసును సీబీఐకి అప్పగించామని, దోషులు ఎంతటి వారైనా చట్టానికి లోబడి శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆశలను, సంపదను నాశనం చేసిన వారిని బోనులో నిలబెట్టే వరకు తమ ప్రభుత్వం విశ్రమించదని ముఖ్యమంత్రి సభలో హెచ్చరించారు. ఈ చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.







