Mahaa Daily Exclusive

  అల్లు అరవింద్ నివాసంలో కేంద్ర మంత్రి సందడి: నూతన వధూవరులను దీవించిన బండి సంజయ్!

Share

అల్లు అరవింద్‌ నివాసానికి కేంద్ర మంత్రి.
* అల్లు వారి కోడలిని దీవించిన బండి సంజయ్‌.
* జూబ్లీహిల్స్‌ నివాసంలో అల్లు కుటుంబ సభ్యుల మర్యాదపూర్వక భేటీ.
హైదరాబాద్, మహా..
హైదరాబాద్, మార్చి 29: ప్రముఖ చలనచిత్ర నిర్మాత అల్లు అరవింద్ నివాసంలో సందడి నెలకొంది. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన అల్లు శిరీష్ – నయనిక రెడ్డి దంపతులను ఆశీర్వదించేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రికి ఘనస్వాగతం పలికారు.
గత కొద్దిరోజుల క్రితం అల్లు శిరీష్, వ్యాపారవేత్త నయనిక రెడ్డిల వివాహం అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అల్లు – కొణిదెల కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను దీవించారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి, నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ భేటీలో అల్లు అరవింద్‌తో పాటు కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రితో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సినీ రంగ విశేషాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి హోదాలో బిజీగా ఉన్నప్పటికీ, సమయం కేటాయించి తమ ఇంటికి వచ్చి పిల్లలను ఆశీర్వదించినందుకు అల్లు అరవింద్ ఈ సందర్భంగా బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, అల్లు కుటుంబ సన్నిహితులు పాల్గొన్నారు.

Latest