కాంగ్రెస్ సర్కార్ కుంభకోణాలపై బీఆర్ఎస్ యుద్ధం.
* 19 అంశాలపై విచారణ కోరుతూ సీఎంకు లేఖ.
* పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే.. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన.
* కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్.
* మాట నిలబెట్టుకో రేవంత్.. 19 స్కామ్‌ల చిట్టా సిద్ధం.. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ సవాల్.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న పలు కుంభకోణాలపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శాసనసభాపక్షం (బీఆర్ఎస్ఎల్పీ) ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసింది. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు తమ ఫిర్యాదులపై సిట్టింగ్ జడ్జి లేదా సభా సంఘంతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. విచారణ సజావుగా సాగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
లేఖ రాయడమే కాకుండా, అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ప్లకార్డులు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అసెంబ్లీకి తరలివెళ్లారు.
**విచారణ కోరుతున్న 19 ప్రధాన అంశాలు**
ముఖ్యమంత్రికి సమర్పించిన లేఖలో బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా 19 అంశాలపై విచారణ జరపాలని కోరింది. ఇందులో సివిల్ సప్లైస్ కుంభకోణం, అమృత్ టెండర్ల వ్యవహారం, కేఎల్ఎస్ఆర్ స్కామ్, నైనీ కోల్ బ్లాక్ మరియు సింగరేణి స్కామ్ వంటి కీలక అంశాలు ఉన్నాయి. వీటితో పాటు సింగరేణి ఓబీ స్కామ్, సోలార్ పవర్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్ లపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
భూములకు సంబంధించి హెచ్‌సీయూ భూములు, లగచర్ల ల్యాండ్ స్కామ్, కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చిన తీరుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ మైక్రో బ్రూవరీ, హమ్ రోడ్స్, టీడీఆర్, యంగ్ ఇండియా స్కూల్స్, ఫోర్త్ సిటీ, హిల్ టీపీ స్కామ్ లపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్, డెక్కన్ సిమెంట్స్ తో పాటు మంచి రేవుల దేవాదాయ భూముల కుంభకోణం వంటి అంశాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, బాధ్యుల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా కోరారు.
**పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే…కేటీఆర్ డిమాండ్**
రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని ఆధారాలతో సహా నిరూపించినా ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమాలు జరిగినట్లు స్వయంగా ముఖ్యమంత్రి అంగీకరించారని, అలాంటప్పుడు మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
“రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లో ముఖ్యమంత్రికి కూడా వాటా ఉందా? అందుకే కాపాడుతున్నారా?” అని కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వం వెంటనే హౌస్ కమిటీ వేయాలని, లేనిపక్షంలో గవర్నర్‌ను కలిసి మంత్రి బర్తరఫ్ కోసం ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ఇతర సంస్థలపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై మాత్రం మెతక వైఖరి అవలంబించడం వెనుక పెద్ద మతలబు ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ అడ్డగోలు పాలనకు బీజేపీ కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోందని, తెలంగాణ ప్రయోజనాల కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.







