Mahaa Daily Exclusive

  జంతు సంరక్షణలో తెలంగాణ మేటి..! సీఎం రేవంత్ రెడ్డి కృషికి మేనకా గాంధీ అభినందనలు..

Share

  •  గోశాలల నిర్మాణానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రణాళికలు.
  •  మూగజీవాల రక్షణే లక్ష్యం…ముఖ్యమంత్రి స్పష్టీకరణ

 

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్రంలో మూగజీవాల సంరక్షణ, గోవుల రక్షణ కోసం ప్రభుత్వం అత్యంత పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం శాసనసభ సమావేశ మందిరంలో ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త, ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ అధ్యక్షురాలు మేనకా గాంధీ బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జంతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు వినూత్న కార్యక్రమాలను ఆయన వారికి వివరించారు.

రాష్ట్రంలో గోసంరక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బృహత్తర గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేవలం ఎన్కేపల్లిలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మరియు ప్రధాన ఆలయాల సమీపంలో విశాలమైన ప్రదేశాల్లో గోశాలలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. జంతువుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించడమే కాకుండా, వాటికి మెరుగైన వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నిర్వహణపై అధికారులు మేనకా గాంధీకి వివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వీధి కుక్కల నియంత్రణ కోసం చేపడుతున్న స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు) ప్రక్రియ, టీకాలు వేయడం వంటి అంశాలను క్షేత్రస్థాయి వివరాలతో సహా వివరించారు. క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు తమ పరిధిలో జంతు సంరక్షణ కోసం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ఈ సందర్భంగా తెలియజేశారు.

తెలంగాణ ప్రభుత్వం జంతు సంక్షేమం పట్ల చూపుతున్న నిబద్ధతను, ప్రభుత్వ యంత్రాంగం ప్రదర్శిస్తున్న చొరవను మేనకా గాంధీ మనస్ఫూర్తిగా అభినందించారు. ముఖ్యంగా గోసంరక్షణ మరియు వీధి కుక్కల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కృషిని కొనియాడుతూ, ఇతర రాష్ట్రాలకు కూడా తెలంగాణ ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తోందని ఆమె ప్రశంసించారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest