- ఆహారపు అలవాట్లపై ఆంక్షలు.
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేదు.
- బీజేపీపై మమత సంచలన వ్యాఖ్యలు.
కోల్కతా, మహా.
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకున్న తరుణంలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆదివారం జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. బెంగాల్లో బీజేపీ గనుక అధికారంలోకి వస్తే ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తినే స్వేచ్ఛను కోల్పోతారని హెచ్చరించారు. ముఖ్యంగా చేపలు, మాంసం, గుడ్లు తినేవారిపై ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని, బెంగాల్లో ఆ పార్టీ జైత్రయాత్ర కొనసాగితే ఇక్కడి ఆహార సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా దెబ్బతింటాయని ఆమె పేర్కొన్నారు.
బీజేపీ సిద్ధాంతాలు ఏకపక్షంగా ఉంటాయని, ఇతర మతాల పట్ల ఆ పార్టీకి కనీస గౌరవం లేదని మమత మండిపడ్డారు. కేవలం అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసమే బీజేపీ అల్లర్లను ప్రేరేపిస్తుందని, అమాయక ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయదని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవడమే ఆ పార్టీ ప్రధాన అజెండా అని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో గిరిజనులు, మహిళల రక్షణ కరువైందని, అక్కడ నిత్యం వారిపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని ఆమె గుర్తు చేశారు. బెంగాల్ ప్రజలు అప్రమత్తంగా ఉండి, రాష్ట్రంలోని మత సామరస్యాన్ని, తమ హక్కులను కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
బీజేపీ అధికారంలోకి వస్తే వ్యక్తిగత స్వేచ్ఛకు తావుండదని, వారు విధించే నియమ నిబంధనల ప్రకారమే ప్రజలు జీవించాల్సి వస్తుందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, తెరవెనుక విభజన రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బెంగాల్ మట్టి వాసన తెలిసిన వారు, ఇక్కడి సంస్కృతిని గౌరవించే వారు మాత్రమే రాష్ట్రాన్ని పాలించాలని, బయటి శక్తులకు ఇక్కడ చోటు లేదని ఆమె స్పష్టం చేశారు.







