- అవినీతి కూటముల ‘మిలాఖత్’ రాజకీయం.
- కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు తోడుదొంగలే!
- అప్పుల ఊబిలో ‘దేవభూమి’.. ఐదు లక్షల కోట్ల రుణభారంతో చితికిపోతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ!
- లూటీ చేసిన సొమ్ము కక్కిస్తాం.. అవినీతిపరుల నుంచి రికవరీ చేసి కేరళాభివృద్ధికే ఖర్చు చేస్తాం!
- కర్ణాటక, హిమాచల్‌లో కాంగ్రెస్ విధ్వంసక మోడల్.. బెంగాల్, త్రిపుర తరహాలోనే కేరళ నాశనం!
- భారతీయుల భద్రతే మా ప్రాధాన్యం.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై పడకుండా నిరంతర కృషి!
- పాలక్కాడ్ గడ్డపై ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని నరేంద్ర మోడీ.
పాలక్కాడ్, మహా.
కేరళ రాజకీయ యవనికపై పెనుమార్పునకు సమయం ఆసన్నమైందని, దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కూటముల వైఫల్యాలను ఎండగడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలక్కాడ్ గడ్డపై ఎన్నికల శంఖారావం పూరించారు. భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్షాలు ‘ఇండియా’ కూటమి పేరుతో అంటకాగుతూ, కేరళలో మాత్రం ఒకరిపై ఒకరు ‘బీ-టీమ్’ అని ఆరోపణలు చేసుకోవడం అత్యంత హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈ రెండు కూటములు అధికారాన్ని మార్చుకుంటూ కేరళను దోచుకున్నాయని, పరస్పరం కుంభకోణాల్లో భాగస్వాములవుతూ ఒకరిపై ఒకరు ఏనాడూ చర్యలు తీసుకోలేదని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. కేరళలో బీజేపీయే అసలైన పోటీదారు అని ఈ రెండు పార్టీలు ఇప్పుడు అంగీకరిస్తున్నాయని, రాష్ట్రంలో మార్పు సందేశం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం ప్రస్తుతం రూ. 5 లక్షల కోట్లకు పైగా రుణభారంతో సతమతమవుతోందని, గత రెండేళ్లలోనే ఈ అప్పు మూడింతలు పెరగడం పాలకుల అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి కేరళ చేరుకుందని, డీఏ మరియు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ల బకాయిల కోసం ఉద్యోగులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో ఒక్క కొత్త పారిశ్రామిక ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కాలేదని, కేరళ అభివృద్ధికి రావాల్సిన నిధులన్నీ పాలకుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతిపరుల నుంచి ప్రతి పైసాను రికవరీ చేసి, ఆ డబ్బును తిరిగి ప్రజల జేబుల్లోకి, కేరళ అభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆయన గట్టి భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్, వామపక్షాల ట్రాక్ రికార్డును ప్రస్తావిస్తూ మోదీ ఘాటు విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలను కమ్యూనిస్టులు ఎలా నాశనం చేశారో దేశం మొత్తం చూసిందని, ఇప్పుడు అదే పద్ధతిలో కేరళను కూడా చిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో కూడా ఆర్థిక సంక్షేమం తాండవిస్తోందని, అక్కడ అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే విధ్వంసక మోడల్ అని, కేరళ ప్రజలు ఈ దుర్మార్గపు రాజకీయాల నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. ప్రతీ రంగంలో ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న వామపక్ష ప్రభుత్వానికి చరమగీతం పాడి, అభివృద్ధి వైపు నడిచే డబుల్ ఇంజిన్ సర్కార్‌ను ఎన్నుకోవాలని కోరారు.
ప్రపంచ పరిణామాలపై స్పందిస్తూ, పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధ ప్రభావం భారతదేశంపై కనిష్ఠంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధాని వెల్లడించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తాను నిరంతరం ప్రపంచ దేశాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నానని, భారతీయుల భద్రతకు ఇతర దేశాలు అత్యంత ప్రాధాన్యతనిచ్చేలా దౌత్యపరంగా విజయం సాధించామని చెప్పారు. విదేశాల్లో ఉన్న భారతీయులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా భారత రాయబార కార్యాలయాలు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. దేశం సురక్షితంగా ఉండాలన్నా, కేరళ అభివృద్ధి చెందాలన్నా బలమైన కేంద్ర ప్రభుత్వం అవసరమని, మోదీ గ్యారెంటీలతో కేరళ భవిష్యత్తును స్వర్ణమయం చేస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు. సభకు హాజరైన వేలాది మంది ప్రజల కరతాళ ధ్వనుల మధ్య మోదీ ప్రసంగం ముగిసింది, ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.







