- సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండండి
- మాదకద్రవ్యాలను దగ్గరకు రానీయొద్దు
- ‘‘నడక-నడత’’ జీవితంలో ఎదగడానికి ఉత్తమ సూత్రం
- ఆరోగ్యకరమైన జీవనశైలితో వికసిత్ భారత్ కు వెన్నెముకగా నిలవండి
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యువభారత్ రన్ ను ప్రారంభించిన నాయుడు
హైదరాబాద్, మహా : యువత సాంఘిక దురాచారాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా స్ఫూర్తితో నిర్వహించిన యువభారత్ రన్ కార్యక్రమానికి కేంద్ర ంత్రి కిషన్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జెండా ఊపి పరుగును ప్రారంభించారు. యువతే దేశ భవిష్యత్తు అని, యువశక్తి సన్మార్గంలో నడుస్తూ ఆరోగ్యం ప్రాధాన్యాన్ని తెలుసుకుని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ వికసిత్ భారత్ కు వెన్నెముకగా నిలవాలని సూచించారు. యువతపై తనకు ఎంతో నమ్మకముందని, ఎవరో కొన్ని కుటుంబాల్లోని యువతరం ఎదిగితే సరిపోతుందని తాను భావించనని, దేశంలోని యువతరమంతా ఎదిగి దేశాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్నది తన ఆకాంక్ష అని ఉద్వేగభరితంగా అన్నారు. అమ్మలారా, నాయనలారా అని యువతను ఆప్యాయంగా సంబోధిస్తూ చక్కటి నడవడికను అలవర్చుకోవాలని, కుటుంబ విలువలను కాపాడాలని సూచించారు.
‘‘ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం మన భారతదేశం. ఈ యువశక్తి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సాకారం చేసుకోగలం. ఆరోగ్య భారత్ మాత్రమే శక్తిమంతమైన దేశాన్ని నిర్మించగలదు. సూర్యోదయంతో పాటు నిద్రలేచి కాసేపు వ్యాయామం చేయండి. స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి సగటు భారతీయుడి ఆయుర్దాయం కేవలం ముప్పై రెండు ఏళ్ళు. నేడు సగటు ఆయుర్ధాయం డెబ్బై సంవత్సరాలు. పెరిగిన ఈ సంవత్సరాలకు మనం అనారోగ్యంతో గడపకూడదు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో మంచి ఆహారం ఒక భాగం. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. తాజాగా వండిన ఆహారం తినాలి.’’ అని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని వెంకయ్యనాయుడు చెప్పారు. ‘‘మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. వాటిని నిరోధించాల్సిన అవసరం చాలా ఉంది.’’ అని చెప్పారు.
‘‘నడక, నడత అనే సూత్రాన్ని యువతరం అలవాటు చేసుకోవాలి. ప్రతి రోజూ ఉదయం నడక ఆరోగ్యానికి మంచిది. నడత అంటే మన ప్రవర్తన. మంచి ప్రవర్తనతో జీవితంలో ఉన్నతస్థానాలకు చేరుకోవచ్చు’’ అని యువతరానికి హితవు పలికారు.
‘‘అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు ఎక్కువ లాంటి దురాభిప్రాయలకు దూరంగా ఉండాలి. మహిళలను గౌరవించాలి. వారిని వేధించే సంస్కృతి పోవాలి. సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లకు బానిసలు కావద్దు. ఫోన్లపై ఎక్కువ సమయం గడిపితే ఆలోచన శక్తి , సృజనాత్మక శక్తి తగ్గిపోతుంది. పిల్లలను వాటికి దూరంగా ఉంచాలి.’’ అని సూచించారు.
‘‘అమ్మ నాన్న, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య ఎవరుంటే వాళ్లతో సమయం గడపండి . వారు జీవితంలో చాలా ముఖ్యమైన వారు. వారితో సమయం గడపడం వల్ల మన జీవన విలువలు పరిపుష్టమవుతాయి. వారి బోధనలు, వారి కథలు, వారి అనుభవాలు ప్రతి రోజు మన మనస్సును మెరుగుపరుస్తాయి. ప్రపంచం మొత్తం మనవైపు చూడడానికి ఒక కారణం మన కుటుంబ వ్యవస్థే. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.’’ అని శ్రీ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మాతృదేశాన్ని, జన్మభూమిని, కన్న తల్లిదండ్రులను, గురువును, మాతృభాషను మరచిపోకూడదన్నారు.
దేశం అభివృద్ధి చెందాలంటే శాంతియుత వాతావరణం ఉండాలన్నారు. ‘‘కుటుంబాల్లో శాంతి ఉంటే సమాజంలో శాంతి ఉంటుంది. సమాజంలో శాంతి ఉంటే దేశంలో శాంతి ఉంటుంది. అభివృద్ధికి ఇది ఎంతో అవసరం. ’’ అని అన్నారు.
ప్రపంచంలో శాంతి లేకపోతే అభివృద్ధి విఘాతమని, ప్రజలకు కష్టాలు తప్పవని ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు తెలియజేస్తున్నాయని చెప్పారు. భారత్ శాంతికాముక దేశమని స్పష్టం చేశారు. యుద్ధం చేసుకుంటున్న దేశాలన్నింటితోనూ మనకు మైత్రి ఉందని, ఆయా దేశాలు మనకు ఇచ్చే గౌరవం అది అని చెప్పారు. సర్వమానవ సౌభ్రాతృత్వమే మన విధానమని స్పష్టం చేశారు. అయితే మన దేశం జోలికి ఎవరైనా వస్తే తగిన గుణపాఠం చెప్పే సత్తా మనకు ఉందని, ఆపరేషన్ సింధూర్ అందుకు నిదర్శనమన్నారు.







