- అస్సాంలో జరుగుతోంది ‘డబుల్ లూటీ’.
- హిమంత్ బిశ్వశర్మ నకిలీ సీఎం…మల్లికార్జున్ ఖర్గే ధ్వజం
- అస్సాం సభలో కాంగ్రెస్ వరాల జల్లు.
లఖింపూర్ (అస్సాం),మహా.
అస్సాం రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామని, ప్రతి మహిళకు నెలవారీ నగదు బదిలీతో పాటు వారు సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవడానికి రూ. 50,000 ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. ఆదివారం లఖింపూర్ జిల్లా నౌబోయిచాలో నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ పార్టీ తరపున ఐదు కీలక ‘గ్యారెంటీ’లను ప్రజల ముందుంచారు.
మహిళా సంక్షేమమే కాకుండా సామాన్య ప్రజల ఆరోగ్యం, భూమి హక్కులపై ఖర్గే పలు కీలక హామీలు ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల వరకు ఉచిత నగదు రహిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే సుమారు 10 లక్షల మంది మూలవాసులకు శాశ్వత భూమి పట్టాలు పంపిణీ చేస్తామని, సీనియర్ సిటిజన్లకు ఇచ్చే నెలవారీ పింఛనును రూ. 1,250 కి పెంచుతామని ప్రకటించారు. ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి కేసులో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఖర్గే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు చెప్పుకుంటున్న ‘డబుల్ ఇంజన్’ సర్కార్ అస్సాంను ‘డబుల్ లూటీ’ చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ ఒక నకిలీ సీఎం అని విమర్శించిన ఆయన, 2021 ఎన్నికల్లో శర్బానంద్ సోనోవాల్ నేతృత్వంలో ఓట్లు అడిగిన బీజేపీ, అధికారం దక్కగానే గిరిజన బిడ్డ అయిన సోనోవాల్‌ను తప్పించి శర్మకు పట్టం కట్టిందని మండిపడ్డారు. బీజేపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, తమ నాయకుల కుటుంబాల ఖజానాలను నింపుకోవడమే లక్ష్యంగా పాలన సాగుతోందని ఆరోపించారు.







