- బడ్జెట్ లెక్కల్లో అంతులేని అగాధం.
- నిధుల కేటాయింపులు, రాబడుల మధ్య 53 శాతం వ్యత్యాసం!
- బ్యాంకు గడప తొక్కని రూ. 52 కోట్ల చెక్కులు.. సర్కారు నిర్లక్ష్యంపై నిప్పులు!
- ఆర్థిక క్రమశిక్షణ గాలికి.. ప్రజాధనం నిర్లక్ష్యం పాలు.
- అంకెల గారడీతో అస్తవ్యస్తం: ప్రభుత్వ నిర్వహణ లోపంతో కోట్లాది రూపాయల వృథా!
- రాష్ట్ర ఆర్థిక స్థితిపై కాగ్ కీలక విశ్లేషణ!
హైదరాబాద్, మహా.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలోని డొల్లతనాన్ని, పర్యవేక్షణా లోపాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక అత్యంత పదునైన విమర్శలతో ఎండగట్టింది. శాసనసభ వేదికగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తాజా నివేదిక, పాలనా యంత్రాంగంలో వేళ్లూనుకున్న నిర్లక్ష్యాన్ని సాక్ష్యాధారాలతో సహా బహిర్గతం చేసింది. మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సామాజిక, ఆర్థిక, సాధారణ రంగాలతో పాటు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధుల వినియోగంపై కాగ్ సంధించిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రణాళికా రాహిత్యం, ఆదాయ వనరులపై సరైన అంచనా లేకపోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రజాధనం నీళ్లప్రాయంగా వృథా అయిందని నివేదిక కుండబద్ధలు కొట్టింది. ఇది కేవలం అంకెల సంకలనం మాత్రమే కాదు, బాధ్యతారాహిత్యానికి నిలువుటద్దమని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలు వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నాయో చెప్పడానికి కాగ్ విశ్లేషించిన గణాంకాలే నిదర్శనం. ముఖ్యంగా 2019-20 మరియు 2020-21 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ రూపకల్పనలో కనీస శాస్త్రీయత లోపించిందని నివేదిక తప్పుబట్టింది. మరీ ముఖ్యంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిధుల కేటాయింపులకు, వాస్తవంగా ప్రభుత్వానికి అందిన రాబడులకు మధ్య ఏకంగా 53 శాతం వ్యత్యాసం ఉండటం గమనార్హం. అంటే ఒకవైపు భారీ లక్ష్యాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, మరోవైపు ఆదాయ మార్గాలను పటిష్టం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్పష్టమవుతోంది. ఈ విధమైన ‘అంచనాల అగాధం’ వల్ల అనేక అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితమయ్యాయని, సంక్షేమ పథకాల అమలులో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుందని కాగ్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆదాయం రాకపోయినా, అంకెల గారడీతో బడ్జెట్‌ను పెంచి చూపడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా తప్పిందని హెచ్చరించింది.
పాలనా యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందంటే, ప్రభుత్వానికి చేరాల్సిన సొమ్మును కనీసం బ్యాంకుల్లో జమ చేసే తీరిక కూడా అధికారులకు లేకపోయిందని నివేదికలో పేర్కొన్న అంశాలు విస్మయం కలిగిస్తున్నాయి. వివిధ శాఖల వద్ద ఏళ్ల తరబడి మూలనపడి ఉన్న చెక్కులు, డ్రాఫ్ట్‌లను 2023 నాటికి కూడా బ్యాంకుల్లో జమ చేయకపోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 52 కోట్ల మేర ప్రత్యక్ష నష్టం వాటిల్లిందని కాగ్ నిగ్గుతేల్చింది. బ్యాంకులతో సరైన సమన్వయం లేకపోవడం, నిధుల ప్రవాహంపై నిరంతర పర్యవేక్షణ కరువవ్వడం వల్ల ఈ దుస్థితి దాపురించిందని వివరించింది. అప్పుల కోసం అన్వేషించే ప్రభుత్వం, తన వద్దే ఉన్న నిధులను సక్రమంగా నిర్వహించుకోలేకపోవడం పర్యవేక్షణ లోపానికి పరాకాష్ట అని నివేదికలో పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల కేవలం ఆదాయం కోల్పోవడమే కాకుండా, ఆ నిధులపై రావాల్సిన వడ్డీని కూడా ప్రభుత్వం నష్టపోవాల్సి వచ్చింది.
సామాజిక భద్రత , భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధుల విషయంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధిని కాగ్ గట్టిగా ప్రశ్నించింది. కార్మికుల అభివృద్ధి కోసం వసూలు చేసిన సెస్ నిధులను పూర్తిస్థాయిలో వారి అవసరాలకు ఖర్చు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తించింది. సామాజిక రంగంలో అనేక కీలక ప్రాజెక్టులు నిధుల కొరతతో కుంటుపడుతుంటే, అందుబాటులో ఉన్న వనరులను కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్వహణ లోపాల కారణంగా వందల కోట్ల రూపాయల మేర రాష్ట్ర ఖజానాకు గండి పడిందని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాగ్ సూచించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని బడ్జెట్ అంచనాల్లో వాస్తవికతను పాటించాలని, ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా కఠినమైన ఆర్థిక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నివేదికలో దిశానిర్దేశం చేసింది.








