Mahaa Daily Exclusive

  అయ్యప్ప సన్నిధిలో కుమ్మక్కు రాజకీయం..! ప్రధాని ‘రహస్య హస్తం’పై రాహుల్ ప్రశ్నల వర్షం..!

Share

  • అయ్యప్ప సన్నిధిలో కుమ్మక్కు రాజకీయం.
  • బీజేపీ, ఎల్‌డీఎఫ్ బంధంపై రాహుల్ గాంధీ ధ్వజం!
  •   బంగారం స్థానంలో ఇత్తడి.. మోదీ మౌనం వెనుక మర్మం ఇదే.
  •   కేరళ గడ్డపై రాహుల్ సంచలన ఆరోపణలు!
  •   విపక్షాలపై కేసులు.. విజయన్‌పై వరాలు.
  •  ప్రధాని ‘రహస్య హస్తం’పై రాహుల్ ప్రశ్నల వర్షం!

 

పథనంతిట్ట,మహా.

కేరళ ఎన్నికల రాజకీయం శబరిమల అయ్యప్ప స్వామి సాక్షిగా ఒక్కసారిగా వేడెక్కింది. మతం కంటే రాజకీయాలకే పెద్దపీట వేస్తూ, బీజేపీ-ఎల్‌డీఎఫ్ కూటమి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం పథనంతిట్ట జిల్లా అడూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ తీరును, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైఖరిని ఎండగట్టారు. ఎక్కడికి వెళ్లినా మతం, ఆలయాల గురించి మాట్లాడే ప్రధాని మోదీ, అయ్యప్ప క్షేత్రానికి నెలవైన పాలక్కడ్‌లో ప్రసంగిస్తూ శబరిమల అంశంపై మౌనం వహించడం వెనుక పెద్ద గూడుపుఠాణీ దాగి ఉందని ఆయన ఆరోపించారు. వామపక్ష ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంతో ఉన్న రహస్య అవగాహన వల్లే మోదీ ఈ మౌన ముద్రను ఆశ్రయించారని, ఇది అయ్యప్ప భక్తులకు చేస్తున్న ద్రోహమని రాహుల్ మండిపడ్డారు.

శబరిమల ఆలయంలో జరిగిన అక్రమాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార ఎల్‌డీఎఫ్ కూటమి నేతలు అయ్యప్ప స్వామి ఆలయానికి చెందిన బంగారాన్ని స్వాహా చేసి, దాని స్థానంలో ఇత్తడిని పెట్టారనే విషయాన్ని ప్రధాని మోదీ ఎలా మర్చిపోయారని ఆయన నిలదీశారు. అయ్యప్ప ఆలయ పవిత్రతను దెబ్బతీస్తూ, అవినీతికి పాల్పడిన వారిపై పల్లెత్తు మాట అనకపోవడం చూస్తుంటే బీజేపీకి భక్తి కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అర్థమవుతోందని విమర్శించారు. యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శబరిమల ఆలయంలో జరిగిన ప్రతి అక్రమంపై విచారణ జరిపించి, దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని భక్తులకు రాహుల్ హామీ ఇచ్చారు. ఆలయ ఆస్తులను కాపాడటంలో వామపక్ష ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఎల్‌డీఎఫ్‌తోనే కాకుండా, బీజేపీ మద్దతు కలిగిన వామపక్ష కూటమితో పోరాడుతోందని రాహుల్ గాంధీ విశ్లేషించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు సైద్ధాంతికంగా సవాల్ విసురుతున్న ఏకైక శక్తి కాంగ్రెస్ మాత్రమేనని, అందుకే కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని బీజేపీ కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. వామపక్ష ప్రభుత్వం తమ నియంత్రణలో ఉంటుందని భావిస్తున్న బీజేపీ, లోపాయికారీగా పినరయి విజయన్‌కు సహకరిస్తోందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్న తరుణంలో, కేరళ ముఖ్యమంత్రిపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం, ఆయనను ఎవరూ ప్రశ్నించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటో ప్రజలు గమనించాలని కోరారు. తనపై 36 కేసులు పెట్టి, 55 గంటల పాటు విచారించిన కేంద్రం, విజయన్ జోలికి ఎందుకు వెళ్లడం లేదని రాహుల్ ప్రశ్నించారు.

దేశ ఆర్థిక పరిస్థితిని, నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ తన ప్రసంగంలోని మైకును చూపించి రాహుల్ విలక్షణంగా విమర్శలు గుప్పించారు. మనం వాడుతున్న మైకులపై కూడా ‘మేడ్ ఇన్ చైనా’ అని రాసి ఉందని, ‘మేడ్ ఇన్ ఇండియా’ లేదా ‘మేడ్ ఇన్ కేరళ’ అని ఎందుకు లేదని ఆయన నిలదీశారు. మోదీ మరియు విజయన్ ఇద్దరూ కలిసి ఈ దేశాన్ని అదానీ, అంబానీల చేతుల్లో పెడుతున్నారని దుయ్యబట్టారు. కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకునే వామపక్ష ప్రభుత్వం ఇప్పుడు కార్పొరేట్ సంస్థల నిధులతో నడుస్తోందని, సామాన్యుడిని విస్మరించిందని విమర్శించారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ ఎలాగైతే రాజీ పడ్డారో, ఇప్పుడు పినరయి విజయన్‌తో మోదీ అలాగే రాజీ పడ్డారని ఎద్దేవా చేశారు. అవినీతి కేసుల ద్వారా విజయన్‌ను మోదీ తన గుప్పిట్లో ఉంచుకున్నారని, అందుకే కేరళలో ఈ విచిత్రమైన ‘బీజేపీ-సీపీఎం’ బంధం కొనసాగుతోందని రాహుల్ గాంధీ విశ్లేషించారు.

Latest