రాష్ట్ర రాజకీయం నుంచి జాతీయ యవనికపైకి.
* ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా!
పాట్నా,మహా.
బీహార్ రాజకీయ ముఖచిత్రంపై దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన అపర చాణక్యుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేశారు. ఈ నెలలో రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో, రాజ్యాంగ నిబంధనలను గౌరవిస్తూ ఆయన సోమవారం తన ఎమ్మెల్సీ (శాసనమండలి సభ్యత్వానికి) రాజీనామా చేశారు. ఒక వ్యక్తి ఒకేసారి రెండు సభల్లో సభ్యుడిగా ఉండకూడదన్న నిబంధన మేరకు, 14 రోజుల గడువు ముగియడానికి సరిగ్గా ఒకరోజు ముందే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఆయన ఏప్రిల్ 9వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామంతో బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసి, జాతీయ స్థాయిలో ఆయన కొత్త పాత్ర పోషించబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
నితీశ్ కుమార్ రాజకీయ ప్రస్థానాన్ని విశ్లేషిస్తే, అది అక్షరాలా ‘కూటమి రాజకీయాల్లో ఒక మాస్టర్ క్లాస్’ అని చెప్పక తప్పదు. 1985లో ఎమ్మెల్యేగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన, అనతి కాలంలోనే జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో రైల్వే, వ్యవసాయ శాఖల మంత్రిగా పనిచేసి తన పరిపాలనా దక్షతను చాటుకున్నారు. అనంతరం 2005లో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నితీశ్, అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారు. పది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే, 2013 తర్వాత నితీశ్ కుమార్ రాజకీయ శైలి విలక్షణంగా మారింది. విశ్లేషకులు దీనిని ‘రివాల్వింగ్ డోర్’ పాలిటిక్స్‌గా అభివర్ణిస్తారు. సిద్ధాంతాల కంటే అధికారమే పరమావధిగా పొత్తులను మార్చుకోవడంలో ఆయన సిద్ధహస్తుడని విమర్శకులు అంటుంటారు. 2013లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న ఆయన, ఆ తర్వాత 2017లో తిరిగి కమలం గూటికి చేరడం, మళ్లీ 2022లో మహాఘటబంధన్ పంచన చేరి, తిరిగి 2024లో ఎన్డీఏ కూటమిలోకి రావడం వంటి పరిణామాలు భారత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏ కూటమితో ఉన్నా ముఖ్యమంత్రి పీఠం మాత్రం ఆయననే వరించడం నితీశ్ రాజనీతిజ్ఞతకు, వ్యూహాత్మక చతురతకు నిదర్శనంగా నిలుస్తోంది.
రాజ్యసభకు వెళ్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి పదవికి ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తారనే అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ, ముఖ్యమంత్రిగా కొనసాగే విషయంలో ఆయన ఇంకా తన నిర్ణయాన్ని స్పష్టం చేయలేదు. ఏప్రిల్ 9న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే బీహార్ ప్రభుత్వ భవిష్యత్తుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పదేపదే పొత్తులు మార్చుకున్నా ప్రజల్లో తనకున్న ఇమేజ్ను కాపాడుకుంటూ వస్తున్న నితీశ్, ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఏ విధమైన రాజకీయాలు నడుపుతారోనని దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తి నెలకొంది.







