Mahaa Daily Exclusive

  ఏవోబీలో మావోయిస్టుల కోట బద్దలు… అగ్రనేత సోమన్న లొంగుబాటు..!

Share

అమరావతి, మహా.

దేశవ్యాప్తంగా మావోయిజం అస్తమయానికి రంగం సిద్ధమైన వేళ, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాల కాలం పాటు అడవిని నమ్ముకుని, గెరిల్లా పోరాటంలో ఆరితేరిన అగ్రనేత, పార్టీ కీలక వ్యూహకర్త చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న సోమవారం ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సోమన్న లొంగుబాటుతో ఏవోబీలో మావోయిస్టుల ఉనికి దాదాపు నామమాత్రంగా మారిందని భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన ‘మార్చి 31, 2026’ గడువుకు కేవలం కొన్ని గంటల ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం సామాజిక, రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. మావోయిస్టుల కంచుకోటగా భావించే ఏవోబీ ప్రాంతంలో ఇక ఆ పార్టీ జెండా రెపరెపలాడే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నారాయణరావు అలియాస్ సోమన్న ప్రస్థానం నిన్న మొన్నటిది కాదు. పాత పీపుల్స్ వార్ గ్రూప్ కాలం నుంచే ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ స్థాయికి చేరుకున్న ఆయన, ఏవోబీ ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలకు వెన్నెముకగా ఉండేవారు. అటవీ ప్రాంతంలో కొత్త రిక్రూట్‌మెంట్లు చేపట్టడంలో, యువతను విప్లవ బాట పట్టించడంలో సోమన్నది అందెవేసిన చేయి. క్షేత్రస్థాయిలో పోలీసుల కదలికలను పసిగట్టడం, గెరిల్లా దాడులకు ప్రణాళికలు రచించడంలో ఆయన ఆరితేరిన వ్యూహకర్త. అటవీ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులపై ఆయనకున్న పట్టు పార్టీకి పెద్ద ఆస్తిగా ఉండేది. అటువంటి నేత ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకోవడం పార్టీ కేడర్‌లో తీవ్ర నైరాశ్యాన్ని నింపినట్లయ్యింది. సోమన్న లొంగుబాటును ఏపీ డీజీపీ త్వరలోనే అధికారికంగా ప్రకటించి, అందుకు గల కారణాలను వెల్లడించనున్నారు.

గత ఏడాది కాలంగా ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ మావోయిస్టుల వెన్నులో వణుకు పుట్టించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యూహంతో అడవి నలుమూలల నుంచి బలగాలు ముట్టడించడంతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఒకవైపు అభివృద్ధి పనులు గ్రామాలకు చేరువ కావడం, మరోవైపు బలగాల ఉక్కుపాదం మధ్య మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోలేకపోయారు. ముఖ్యంగా, 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజం అనే మాటే వినిపించకూడదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పం ఇప్పుడు అక్షరాలా సాకారమవుతున్నట్లు కనిపిస్తోంది. సరిగ్గా ఆ గడువు ముగియడానికి 24 గంటల ముందే సోమన్న వంటి కీలక నేత ఆయుధాన్ని విడిచిపెట్టడం ప్రభుత్వ విజయాన్ని, బలగాల పట్టును స్పష్టం చేస్తోంది.

Latest