- ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఉనికి కోల్పోయిన పార్టీ
- లొంగిపోయిన మిగిలిన ఒకే ఒక్కడు చెల్లూరి నారాయణరావు
అమరావతి, మహా: మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్రం ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’ లక్ష్యాన్ని ఏపీ చేరుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన ఒకే ఒక్కడు చెల్లూరి నారాయణరావు కూడా సోమవారం డీజీపీ ఎదుట లొంగిపోవడంతో ఏపీలో పార్టీ పూర్తిగా కనుమరుగైంది.
మావోయిస్టు పార్టీ కీలక నాయకుల్లో చాలావరకూ ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణరావు ఏపీ పోలీసులకు టచ్‌లోకి వచ్చారు. సంప్రదింపుల అనంతరం సోమవారం తన దళంతో సహా డీజీపీ ముందు లొంగిపోయారు. దీంతో 1980 నుంచి మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కులా వ్యవహరించిన ఏపీ నాయకత్వం ఇక చరిత్ర పుటల్లోకి చేరబోతోంది.
నక్సలైట్ల నుంచి మావోయిస్టుల వరకూ…
నక్సల్ బరిలో పుట్టిన విప్లవ పార్టీలో సభ్యుల్ని నక్సలైట్లుగా పిలిచేవారు. ఆ తర్వాత పీపుల్స్ వార్ గ్రూపుగా కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించింది. ఉమ్మడి ఏపీ లో బలంగా ఉన్న మావోయిస్టులను అణచి వేసేందుకు గ్రేహౌండ్స్ ద ళాన్ని ఏర్పాటుచేసిన రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులకు శిక్షణ సహకారం అందించింది. రాష్ట్ర విభజన తర్వాత గతేడాది నవంబరు మూడో వారంలో హిడ్మా ఎన్‌కౌంటర్‌తో సత్తా చాటింది. రాష్ట్రంలో ఒకప్పుడు మంత్రులు, ఐపీఎస్ అధికారుల్ని సైతం కాల్చి చంపిన మావోయిస్టులు తుపాకీ రాజ్యం స్థాపిస్తామని ప్రభుత్వాలకు సవాలు విసిరారు. తమ ఉనికి కోసం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ ప్రజా ప్రతినిధులపై దాడులు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలు విసిచారు. 2003లో సీఎం చంద్రంబాబుపై అలిపిరి వద్ద దాడి చేసిన మావోయిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. తమ పార్టీకి అదే పెద్ద శాపమని మావోయిస్టులు గతంలో పేర్కొన్నారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల నుంచి దండకారణ్యంలో మావోస్టుల వరకూ అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా శ్రమించింది. ఈ నెల 31లోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పలుమార్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆ పార్టీని చావుదెబ్బ తీశారు. ఈ క్రమంలో కేంద్రం విధించిన గడువు నాటికి ఏపీలో మావోయిస్టు నాయకత్వం తుడిచిపెట్టుకు పోయిందని ఏపీ పోలీసులు ప్రకటించారు.







