- సహజీవనం చేస్తున్న జంటలకు కుటుంబ హోదా
- జనగణన 2027నిబంధనల్లో కేంద్రం కీలక నిర్ణయం
- ఏప్రిల్ 1 నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం
- జనగణన పూర్తిగా డిజిటల్ మాధ్యమాల నిర్వహణ
- సేకరించిన సమాచారం అత్యంత రహస్యంగా ఉంచుతాం
- సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్
న్యూఢిల్లీ, మహా : జనగణన 2027 నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. సహజీవన జంటలకు సైతం కుటుంబ హోదా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. చాలాకాలం నుంచి సహజీవనం చేస్తున్న వారిని సైతం ఒకే ఫ్యామిలీగా గుర్తించి కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. భారత్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జనగణన (సెన్సస్ 2027) ప్రక్రియకు రంగం సిద్ధమైన నేపథ్యంలో భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈసారి జనగణనను పూర్తిస్థాయిలో డిజిటల్ మాధ్యమాల ద్వారా నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో జరుగుతున్న ఎనిమిదవ జనగణన ఇది. చివరిసారిగా 2011లో దేశవ్యాప్త గణన జరిగిన విషయం తెలిసిందే.
వ్యక్తిగత సమాచారానికి పూర్తి రక్షణ
జనగణనలో ప్రజలు అందించే వ్యక్తిగత వివరాల భద్రతపై సెన్సస్ కమిషనర్ స్పష్టత ఇచ్చారు. సెన్సస్ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం, సేకరించిన సమాచారం అత్యంత రహస్యంగా ఉంటుందని తెలిపారు. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కూడా పొందే అవకాశం లేదని, అలాగే ఏ కోర్టులోనూ వీటిని సాక్ష్యంగా పరిగణించరని ఆయన పేర్కొన్నారు. ప్రజల గోప్యతకు ఎటువంటి భంగం కలగకుండా ఈ ప్రక్రియ కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
రెండు దశల్లో గణన ప్రక్రియ
జనగణన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని, మరో కొద్ది రోజుల్లోనే మొదటి దశ పనులు ప్రారంభమవుతాయని సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడించారు. తొలి దశలో ‘ఇళ్ల జాబితా మరియు గృహ గణన’ చేపడతారు. ఈ భారీ ప్రక్రియలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుందని, క్షేత్రస్థాయిలో గణనను విజయవంతం చేసేందుకు భారీగా సిబ్బందిని సమీకరిస్తున్నట్లు ఆయన వివరించారు. భారత్లో ఓవరాల్గా ఇది 16వ జనగణన ప్రక్రియ కాగా, ఏప్రిల్ 1 నుంచి రెండు దశల్లో ప్రారంభం కానుంది. తొలిదశలో భాగంగా అధికారులు మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి గృహ గణన చేపట్టి వివరాలు సేకరిస్తారు. రెండో దశలో అసలైన జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలవుతుంది. ఈసారి ప్రత్యేకంగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వినూత్న అవకాశాన్ని కేంద్రం కల్పించింది.
ఈ జనగణన కోసం మొత్తం 33 ప్రశ్నలతో కూడిన సమగ్ర ప్రశ్నావళిని రూపొందించారు. ఇందులో ఇంటి యజమాని వ్యక్తిగత వివరాలు, కులం, కుటుంబ సభ్యుల వయసుతో పాటు గృహోపకరణాలు, వాహనాలు, ఇంటర్నెట్ సౌకర్యం వంటి వస్తువుల లభ్యతపై వివరాలు సేకరిస్తారు. అలాగే తాగునీటి వనరులు, మరుగుదొడ్లు, వంటకు ఉపయోగించే ఇంధనం వంటి జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశాలను కూడా నమోదు చేస్తారు. సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి జరిగే ఈ ప్రక్రియ, 2011 తర్వాత కోవిడ్ కారణంగా ఆలస్యమై ఇప్పుడు పట్టాలెక్కుతోంది.







