Mahaa Daily Exclusive

  ధాన్యపు రాశులకు ‘పట్టా’భిషేకం..! యాసంగి కొనుగోలుకు సర్కార్‌ సిద్ధం!

Share

  •  యాసంగి కొనుగోలుకు సర్కార్‌ సిద్ధం!
  •  68.5 లక్షల ఎకరాల్లో ‘పసిడి’ పంట..
  •  72 గంటల్లోనే ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము!
  •  అక్రమాలకు జీపీఎస్‌తో చెక్!
  •  160 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిపై సర్కార్ నజర్!
  •  వరి గింజకు సర్కార్ భరోసా.
  •  తడిసినా, ఎండినా అండగా ఉండేలా పకడ్బందీ ఏర్పాట్లు!

 

హైదరాబాద్, మహా.

 

తెలంగాణ పల్లె గుండెల్లో ఇప్పుడు పసిడి కాంతులు విరజిమ్ముతున్నాయి. నిప్పులు చెరిగే భానుడి భగభగలను లెక్కచేయక, చెమటను చిందించి అన్నదాత పండించిన ‘యాసంగి’ వరి పంట కోతకు వచ్చి, ఖల్లాలు ధాన్యపు రాశులతో కళకళలాడబోతున్నాయి. రికార్డు స్థాయిలో సాగైన 68.50 లక్షల ఎకరాల మాగాణం నుంచి వెల్లువెత్తుతున్న 160 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన జవజీవాలను అందించబోతోంది. అయితే, ఈ పసిడి పంట రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపాలంటే, అది సకాలంలో అమ్ముడుపోయి, ఆ కష్టం తాలూకు సొమ్ము నేరుగా రైతు ఖాతాకు చేరాలి. ఈ కీలక బాధ్యతను భుజానికెత్తుకున్న రాష్ట్ర ప్రభుత్వం, 2025-26 రబీ సీజన్ ధాన్యం సేకరణను ఒక మహోన్నత ‘యజ్ఞం’లా భావిస్తోంది. “రైతు గడప దాటిన ధాన్యం మిల్లుకు చేరాలి.. మిల్లు నుంచి వెలువడే సొమ్ము రైతు ఖాతాకు చేరాలి” అన్న నినాదంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సన్నద్ధమైంది.

 

**రికార్డు స్థాయి సాగు విస్తీర్ణం..68.50 లక్షల ఎకరాల్లో వరి పంట**

 

ఈ ఏడాది యాసంగి సీజన్‌లో తెలంగాణ అద్భుతమైన సాగు రికార్డును నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 68.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, కరీంనగర్ వంటి జిల్లాల్లో వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సాగునీటి లభ్యత పెరగడం, ఉచిత విద్యుత్ సరఫరా క్రమబద్ధంగా ఉండటంతో రైతులు వరి వైపు మొగ్గు చూపారు. ఈ భారీ విస్తీర్ణం రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.

 

** 160 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం**

 

సాగుకు తగ్గట్టే దిగుబడి కూడా ఈసారి ఆశాజనకంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 నుంచి 160 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రాథమిక అంచనా. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ దిగుబడిలో ప్రభుత్వం సుమారు 90 నుంచి 100 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నేరుగా సేకరించాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

 

**7,150 సెంటర్లలో 25 వేల మంది సిబ్బంది**

 

రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా, గ్రామాల చెంతనే 7,150 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఐకేపీ , ప్యాక్స్ ఆధ్వర్యంలో నడిచే ఈ కేంద్రాల్లో సుమారు 25,000 మంది సిబ్బందిని విధుల్లో ఉంచారు. ఇందులో కొనుగోలు కేంద్రాల ఇన్-చార్జీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు , తూకం వేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా మానవ తప్పిదాలు జరగకుండా సాఫ్ట్‌వేర్ ఆధారిత పర్యవేక్షణ కొనసాగనుంది.

 

** ప్రభుత్వానికి చేరనున్న 67 కిలోల బియ్యం**

 

సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,800 రైస్ మిల్లులను సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం, ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చే ప్రతి 100 కిలోల ధాన్యానికి, వారు 67 కిలోల ముడి బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల కోటా ఉంటుంది. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని సకాలంలో ఎఫ్.సి.ఐ కి అప్పగించేలా మిల్లర్లతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నారు. దీనిపై కలెక్టర్లు మిల్లుల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

 

** ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్**

 

ధాన్యం రవాణాలో జరిగే అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈసారి సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంది. కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలించే ప్రతి వాహనానికి GPS ట్రాకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేశారు. దీనివల్ల ఏ వాహనం ఎక్కడికి వెళ్తోంది, ఎంత సమయం పడుతుందనే అంశంపై కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర నిఘా ఉంటుంది. మధ్యలో ధాన్యం మళ్లింపు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

 

**25 కోట్ల సంచులతో యంత్రాంగం సిద్ధం**

 

ధాన్యం ప్యాకింగ్ కోసం గన్నీ బ్యాగుల కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని గుర్తించి, వాటిని మిల్లర్ల నుంచి మరియు ఇతర వనరుల నుంచి సేకరించారు. పాత సంచులతో పాటు కొత్త సంచులను కూడా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. గన్నీ బ్యాగుల విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బఫర్ స్టాక్‌ను కూడా మెయింటైన్ చేస్తున్నారు.

 

**కేంద్రాల వద్ద టార్పాలిన్లు, తేమ యంత్రాలు**

 

వేసవిలో వచ్చే అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతు నష్టపోకుండా ఉండేందుకు ప్రతి కేంద్రం వద్ద సరిపడా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచారు. ధాన్యం నాణ్యతను పరీక్షించేందుకు తేమ కొలిచే యంత్రాలను , ధాన్యం శుభ్రం చేసే యంత్రాలను క్రాస్ చెక్ చేసి సిద్ధంగా ఉంచారు. ధాన్యం 17% కంటే తక్కువ తేమ ఉంటేనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

 

** కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు**

 

కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు మరియు సిబ్బందికి వడదెబ్బ తగలకుండా ప్రభుత్వం మానవీయ కోణంలో ఏర్పాట్లు చేసింది. ప్రతి కేంద్రం వద్ద నీడ సౌకర్యం, తాగునీరు , అత్యవసర వైద్యం కోసం ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లు ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా తూకం ప్రక్రియను ఉదయం మరియు సాయంత్రం వేళల్లో వేగంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.

 

**నేరుగా ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము.. 72 గంటల్లోనే రైతులకు చెల్లింపులు**

 

రైతులకు చెల్లింపుల విషయంలో గతంలో ఎదురైన జాప్యాన్ని ఈసారి ప్రభుత్వం పూర్తిగా నివారించనుంది.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా, ధాన్యం తూకం వేసి నమోదు చేసిన 48 నుంచి 72 గంటల వ్యవధిలోనే నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రభుత్వం గ్రేడ్-ఏ రకానికి రూ. 2,320 మరియు సాధారణ రకానికి రూ. 2,300 మద్దతు ధరను కల్పిస్తోంది. రైతులకు చిట్టచివరి రూపాయి అందే వరకు అధికారులే బాధ్యత వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

** ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో కొనుగోలు యజ్ఞం**

 

వచ్చే వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించనున్నారు. గ్రామ సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు ఈ కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కలెక్టర్లు కోరారు. ఇబ్బందికరమైన కేంద్రాలలో ప్రత్యేక పర్యవేక్షకులను నియమించి, ఎక్కడా ఘర్షణలు లేదా జాప్యం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణ అన్నదాత ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ కొనుగోలు యజ్ఞం ప్రధాన ఉద్దేశ్యం.

Latest