Mahaa Daily Exclusive

  కేసీఆర్ ను హౌజ్ అరెస్టు చేశారేమో..  అనుమానం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!

Share

  • కేసీఆర్ ను హౌజ్ అరెస్టు చేశారేమో
  • అనుమానం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చిందని వ్యాఖ్య
  • నియోజక వర్గాల పునర్విభజన వల్ల నష్టం జరుగుతుంది
  • ఆహార కల్తీపై ఈగల తరహా వ్యవస్థ అవసరం
  • మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, మహా : రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో సోమవారం మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్‌చాట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తనకు ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రామాయణాన్ని ఉదహరిస్తూ, రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడికి అంత గుర్తింపు, విలువ పెరిగిందన్నారు. కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని అందరూ భావిస్తున్న్పటికీ, ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారేమోనని తనకు అనుమానం కలుగుతోందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

డీలిమిటేషన్‌- దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు

 

కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఒకవేళ లోక్‌ సభ సీట్లు 50 శాతం పెరిగితే, అదనంగా 410 సీట్లు వస్తాయని, అయితే ఇందులో మెజారిటీ సీట్లు ఉత్తరాది రాష్ట్రాలకే వెళ్తాయని విశ్లేషించారు. దీని వల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోతుందని, దక్షిణాది మద్దతు లేకుండానే కేంద్రంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు లక్షణ్‌, బండి సంజయ్‌, కిషన్ రెడ్డి చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

 

ఆహార కల్తీపై ఈగల్ తరహా పోరాటం

 

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఆహార కల్తీ మాఫియా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే ఈ అక్రమ కట్టడాలపై హైడ్రా, మాదక ద్రవ్యాలపై ఈగల్‌ వ్యవస్థలు విధంగా పని చేస్తున్నాయో అదే తరహాలో ఆహార కల్తీని అరికట్టేందుకు ఒక ప్రత్యేక, శక్తివంతమైన వ్యవస్థను తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న అత్యుత్తమ ఆహార భద్రతా చట్టాలను ప్రభుత్వం క్షణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఈ వ్యవస్థకు విస్తృత అధికారులతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించనున్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై హత్యానేరం కంటే కఠినమైన చర్యలు తీసుకునేలా చట్టాలను రూపొందిస్తున్నారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచే వారిని వదిలి పెట్టబోమని, సామాన్యులకు ఇబ్బంది కలిగించే అక్రమ నిల్వదారులు కఠిన శిక్షలకు గురవుతారని సీఎం హెచ్చరించారు.

 

రైతు సంక్షేమం- దళారీ వ్యవస్థకు చెక్

 

రైతులు తమ పంటకు తామే ధర నిర్ణయించుకునే పరిస్థితి లేకపోవడంపై రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారుల దోపిడీ చేస్తున్నారని దీనిని అడ్డుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతు హక్కులకు కాపాడడానికి, వారికి సరైన గిట్టుబాటు ధర కల్పించడానికే తమ ప్రభుత్వం ఎంఎస్‌పీ చట్టాన్ని తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్‌లో రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పిస్తామని సీఎం తెలిపారు.

 

సన్న బియ్యం పథకం ఒక విప్లవాత్మక మార్పు

 

గతంలో అమలైన కిలో బియ్యం పథకంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రజలు వాటిని తినలేక మాఫియా చేతుల్లోకి వెళ్లేవని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ బ్లాక్ మార్కెట్‌ మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 86 శాతం మంది ప్రజలకు అంటే విద్యార్థులు పౌష్ఠికాహారం అందించడం తమ తదుపరి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రేషన్ ద్వారా నాణ్యమైన బియ్యం అందించడమే కాకుండా, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం తమ తదుపరి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Latest