- మార్పు కోసం ఓటు – కాంగ్రెస్‌తోనే భవిష్యత్తు
- పదేళ్ళ ఎల్‌డిఎఫ్ పాలనకు ముగింపు పలకాలి
- కేరళంలో మార్పు కోసం యుడిఎఫ్‌ను గెలిపించాలి
- రాహుల్ తో పాటు బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి పొంగులేటి
హైదరాబాద్ : “కేరళం ప్రజలారా… మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. పది సంవత్సరాల ఎల్‌డిఎఫ్ అసమర్ధ పాలనకు ముగింపు పలకండి…అవినీతి పాలనను అంతం చేయండి.. విభజన రాజకీయాలను తిరస్కరించండి…అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన కోసం యూడిఎఫ్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి ” అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. “ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వ మార్పు కోసం కాదు… కేరళం భవిష్యత్తు కోసం. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించి, యూడిఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు” అని మంత్రి ర్కొన్నారు. సోమవారం కేరళంలోని పత్తనం తిట్ట జిల్లాలోని ఆడూరు, అరుణ్ ముల నియోజకవర్గలలో కేఎస్ఆర్టీసీ జంక్షన్ వద్ద జరిగిన ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభలో మంత్రి పొంగులేటి ప్రసంగించారు. కేరళంలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎల్‌డిఎఫ్ పాలన ప్రజలను పూర్తిగా నిరాశ పరిచిందని ఆరోపించారు. “పది సంవత్సరాలుగా కేరళంను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్న ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అవినీతి పాలనకు ప్రతీకగా మారిందని యువతకు ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు రావడం లేదు, సంక్షేమం కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైందని మంత్రి విమర్శించారు.
“దేశ వ్యాప్తంగా విభజన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచే బిజేపీకి కేరళంలో స్థానం లేదని ప్రజలు ఇప్పటికే పలుమార్లు తీర్పు ఇచ్చారు” అని అన్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రత్యామ్నాయం యూడిఎఫ్ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలనను ఉదాహరణగా చూపుతూ, “మేము ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుతున్నామో దేశం చూస్తోంది. అదే విధంగా కేరళంలో కూడా ప్రజా పాలన తీసుకురాగలిగేది కాంగ్రెస్ మాత్రమే” అని మంత్రి స్పష్టం చేశారు.








