- భావప్రకటన స్వేచ్ఛను హరించేలా సర్కారు కుట్ర.
- సామాన్యుడికి సంకెళ్లు.. అధికారులకు రక్షణ కవచమా?
- కొత్త బిల్లుపై సభలో ఏలేటి నిప్పులు.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘హెట్ స్పీచ్ బిల్లు’పై భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లు ప్రజాస్వామ్య గొంతు నొక్కేలా ఉందని, మానవ హక్కుల ఉల్లంఘనకు నిలువెత్తు సాక్ష్యమని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ నిర్ణయం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ, కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసమే ఈ నల్ల చట్టాన్ని తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, అధికారులకు అడ్డగోలు రక్షణ కల్పించడమే ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశమని ఆయన విమర్శించారు.
బిల్లులోని నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని, దీనిని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కక్ష కట్టే ప్రమాదం ఉందని ఏలేటి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చరిత్రకు సంబంధించిన అంశాలపై, గతంలో పాలించిన నిజాం లేదా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వంటి వ్యక్తుల గురించి మాట్లాడినా సరే, వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేలా నిబంధనలు రూపొందించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది కేవలం మతాల మధ్య విద్వేషాలను అరికట్టడానికి ఉద్దేశించినది కాదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే గళాలను అణచివేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్ అని దుయ్యబట్టారు. చట్టంలోని సెక్షన్ 4 అనేది ప్రజాస్వామ్యానికి ‘డెత్ వారెంట్’ వంటిదని, దీనిని తమ పార్టీ పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
నేరం రుజువు కాకముందే, కనీసం సరైన ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసే అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తోందని ఏలేటి పేర్కొన్నారు. ఇది చట్టం దృష్టిలో అమాయకులను నేరస్థులుగా మార్చే ప్రక్రియ అని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి సంకెళ్లు వేసి, తప్పు చేసే అధికారులకు రక్షణ కవచంలా మారే ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఇంతటి కీలకమైన మరియు అత్యంత ప్రమాదకరమైన చట్టాన్ని తీసుకువచ్చే ముందు కనీసం సభలో సమగ్ర చర్చ జరగలేదని, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఏదైనా చట్టం చేసే ముందు దాని పర్యవసానాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ నేపథ్యంలో, ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లకుండా ఈ బిల్లుపై తక్షణమే పునరాలోచన చేయాలని ఏలేటి డిమాండ్ చేశారు. హెట్ స్పీచ్ బిల్లుపై ఒక ‘హౌస్ కమిటీ’ని వేసి, లోతైన అధ్యయనం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఈ బిల్లును ‘సెలెక్ట్ కమిటీ’కి పంపి, అందరి ఆమోదయోగ్యమైన సవరణలు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యయుతమైన చర్చలు జరగకుండా, ఇలాంటి వివాదాస్పద బిల్లులను చట్టంగా మార్చడం భావ్యం కాదని హితవు పలికారు. అణచివేత ధోరణితో పౌరుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని, ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.







