Mahaa Daily Exclusive

  సర్పంచుల గోస పట్టదా..? నిధుల మళ్లింపుపై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు..!

Share

  •   నిధుల మళ్లింపుపై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు!
  •   గ్రామ పంచాయతీల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం గండి.
  •   సర్పంచుల ‘ఛలో అసెంబ్లీ’కి బీజేపీ సంపూర్ణ మద్దతు!
  •   రూ. 640 కోట్ల కేంద్ర నిధులు ఏమయ్యాయి?
  •   పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల పోరు.. రంగంలోకి బీజేపీ!

 

హైదరాబాద్‌, మహా.

తెలంగాణలో గ్రామ పంచాయతీల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని, కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడం అత్యంత దారుణమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘ఛలో అసెంబ్లీ’ పిలుపులో భాగంగా తమ సమస్యలను వివరించిన సర్పంచుల గోడును విన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన సుమారు రూ. 640 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధుల కొరత, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా సర్పంచులు తీవ్ర ఒత్తిడికి లోనై, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన విషాదకర పరిస్థితులను రాంచందర్ రావు గుర్తు చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే సర్పంచులకు న్యాయం చేస్తామని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా, ఆ వాగ్దానాలు ఇప్పటికీ నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఆయన విమర్శించారు. ఇప్పటికే కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించిన తరుణంలో, పాత బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా వస్తున్న నిధులను కూడా దారి మళ్లించడం గ్రామాల్లో పాలనను కుంటుపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిధుల కొరత వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందడం లేదని, కనీసం చిన్నపాటి అభివృద్ధి పనులు కూడా చేపట్టలేని దుస్థితి నెలకొందని రాంచందర్ రావు వివరించారు. 16వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు సమయం దగ్గరపడుతున్నా, 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, కేంద్ర నిధులను వెంటనే గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని, మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను తక్షణమే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచులు చేపట్టిన ఈ న్యాయమైన పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని, వారి సమస్యల పరిష్కారం అయ్యే వరకు బీజేపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Latest