హైదరాబాద్, మహా .
నిర్మల్ పట్టణంలో మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని కోరుతూ బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం వాయిదా తీర్మానం ఇచ్చారు. శాసనసభ కార్యదర్శికి అందజేసిన ఈ నోటీసులో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
నిర్మల్ పట్టణంలో హిందూ మైనర్ బాలికలపై జరిగిన అమానుష ఘటన అత్యవసర ప్రజా ప్రాముఖ్యత కలిగిన విషయమని, దీనిపై సభలో తక్షణమే చర్చ జరపాల్సిన అవసరం ఉందని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ కార్యవిధానం, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 63వ నియమం కింద సభా కార్యక్రమాలను వాయిదా వేసి, ఈ ఉదంతంపై సమగ్ర చర్చకు అనుమతించాలని ఆయన కోరారు.
ఈ ఘటనపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన ఈ వాయిదా తీర్మానం ప్రతులను సభాపతితో పాటు సంబంధిత శాఖ మంత్రికి కూడా పంపారు. అత్యంత సున్నితమైన మరియు తీవ్రమైన ఈ అంశంపై సభలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








