చెన్నై,మహా.
రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 404.58 కోట్లుగా (రూ. 4,04,58,57,196) ఉంది. బ్యాంకు డిపాజిట్లు, వివిధ పెట్టుబడులు, ఖరీదైన వాహనాలతో పాటు ఇతర చరాస్తుల వివరాలను ఆయన ఈ అఫిడవిట్లో కూలంకషంగా పొందుపరిచారు.
తన వద్ద నగదు రూపంలో రూ. 2 లక్షలు ఉండగా, భార్య సంగీత వద్ద రూ. 1 లక్ష ఉన్నట్లు విజయ్ పేర్కొన్నారు. తన సంపదలో సింహభాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉంది. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో సుమారు రూ. 388 కోట్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వాహనాల విషయానికొస్తే, విజయ్ వద్ద అత్యంత విలాసవంతమైన కార్ల సేకరణ ఉంది. బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫైర్ వంటి ఖరీదైన కార్లతో పాటు ఇతర ఆటోమొబైల్స్, ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, వీటి మొత్తం విలువ రూ. 14.35 కోట్లు ఉంటుందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
బంగారం, వెండి ఆభరణాల వివరాలను కూడా విజయ్ సమర్పించారు. తన వద్ద 883 గ్రాముల బంగారం ఉందని, దాని విలువ సుమారు రూ. 1.20 కోట్లు ఉంటుందని తెలిపారు. అలాగే రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తుల విషయానికి వస్తే, తాను స్వయంగా కొనుగోలు చేసిన ఆస్తులతో పాటు వారసత్వంగా వచ్చినవి కూడా ఉన్నాయని వెల్లడించారు. తన ప్రధాన ఆదాయ వనరులుగా స్వయం ఉపాధి, వడ్డీలు, ఆస్తుల నుంచి వచ్చే అద్దెను ఆయన చూపించారు. ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో విజయ్ ఏకంగా రూ. 184.53 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు అఫిడవిట్ ద్వారా స్పష్టమైంది.








