Mahaa Daily Exclusive

  కాళేశ్వరం ప్రాజెక్టు.. రూ. లక్ష కోట్ల ప్రజాధనం వృథా.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్..

Share

ఢిల్లీ, మహా.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పేరుతో సుమారు రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాజ్యసభలో ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్ మరియు డిజైన్ లోపాలే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం రాజ్యసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో, బీఆర్ఎస్ సభ్యుడు సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి తీవ్ర స్థాయిలో స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన కింద నిధులు మంజూరు చేయాలని సురేష్ రెడ్డి కోరగా, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలను మంత్రి ఎండగట్టారు.

దాదాపు రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాతే అనుమతుల కోసం కేంద్రం వద్దకు వచ్చారని సీఆర్ పాటిల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవడంపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, ప్రాజెక్టు లోపాలపై ప్రస్తుతం కేంద్ర బృందం లోతైన అధ్యయనం చేస్తోందని వివరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు జల్‌జీవన్ మిషన్ నిధుల వినియోగంలోనూ తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని కేంద్ర మంత్రి మండిపడ్డారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఒక్క ప్రతిపాదన కూడా అందలేదని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ వద్ద రూ. 873 కోట్ల జల్‌జీవన్ మిషన్ నిధులు అందుబాటులో ఉన్నాయని, అయినప్పటికీ గత మూడేళ్ల కాలంలో కేవలం రూ. 194 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గణాంకాలతో సహా వివరించారు. నిధులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీఆర్ పాటిల్ విమర్శించారు.

Latest