Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..

Share

  • ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
  • అనుచిత వ్యాఖ్యల కేసులో సీఐడీ నోటీసులు
  • ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశం
  • తగ్గేదే లేదన్న హుజురాబాద్ ఎమ్మెల్యే

హైదరాబాద్, మహా : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చిక్కులు తప్పటం లేదు. ఇప్పటికే అసెంబ్లీలో కడియం శ్రీహరిని బెదిరించారన్న ఆరోపణలతో ఆయనపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా.. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ గౌస్ ఆలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. జనవరి 29న వీణవంక మండలంలో జరిగిన మినీ మేడారం జాతర సందర్భంగా బందోబస్తులో ఉన్న పోలీసులకు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు తనను, తన కుటుంబాన్ని జాతర వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కరీంనగర్ సీపీ గౌస్ ఆలంను ఉద్దేశించి ఆయన మతంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేసారు. ఏప్రిల్ 4న జరిగే విచారణలో కౌశిక్ రెడ్డి వివరణ తీసుకోనున్నారు. గత కొంతకాలంగా అధికార పక్షంపై నిప్పులు చెరుగుతున్న కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు రావడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇది కక్షపూరిత చర్య అని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికార కాంగ్రెస్ మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని అంటోంది.

 

తగ్గేదేలే… కౌశిక్ రెడ్డి

 

ఈ నోటీసులపై పాడి కౌశిక్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రశ్నించే గొంతును అణచలేరని, ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఏ తప్పు చేయకపోయినా నోటీసులు పంపారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. తాను వెనక్కి తగ్గేది లేదని ట్వీట్ చేశారు. ‘ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో నా కుటుంబ సభ్యులను ,మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇలా బెదిరింపులకు గురిచేయడం తగునా? రాజకీయాలు నాపై చేయండి.. కానీ నా కుటుంబాన్ని, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. నేను వెనక్కి తగ్గను. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు.. ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. నిలదీస్తూనే ఉంటాను. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు. ప్రజల కోసం చేసే బాధ్యత. ప్రశ్నించే గొంతును అణచలేరు..ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’ అని కౌశిక్ రెడ్డి ట్వీట్ చేశారు.

Latest