Mahaa Daily Exclusive

  బిహార్ లోని నలందలో ఘోర ఘటన..! ఆలయంలో తొక్కిసలాట 8 మంది భక్తులు మృతి..

Share

  • బిహార్ లోని నలందలో ఘోర ఘటన
  • ఆలయంలో తొక్కిసలాట
  • 8 మంది భక్తులు మృతి
  • సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
  • మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం

పాట్నా, మహా : బిహార్‌లోని నలందలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. దీపనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఘడాలో ఉన్న శీతల్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొంత మంది భక్తులు గాయపడ్డారు. మృతుల్లో పలువురు మహిళలు పాట్నాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. శీతల్ దేవి ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో పాటు సరైన ఏర్పాట్లు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఎంతమంది భక్తులు మరణించారనే విషయంపై నలంద అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు.

 

ప్రతి మంగళవారం వేల సంఖ్యలో భక్తుల రాక

 

ప్రతి మంగళవారం మాతా శీతల్ దేవి ఆలయంలో పూజలు చేయడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే, ఈ మంగళవారం భద్రతా ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పూజలు చేయడానికి భక్తులు భారీగా తరలివచ్చారు, అదే సమయంలో తోపులాట జరిగి అది తొక్కిసలాటకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పలు అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎస్డీఎం కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

శీతల్ దేవి ఆలయంలో తొక్కిసలాటపై సీఎం నితీష్ దిగ్భ్రాంతి

 

నలంద లోని ప్రముఖ శీతల్ దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 8 మంది భక్తులు చనిపోవడంపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు విపత్తు నిర్వహణ శాఖ నుండి రూ. 4 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున (మొత్తం రూ. 6 లక్షలు చొప్పున) ఎక్స్‌గ్రేషియాను సీఎం నితీష్ ప్రకటించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం, అరకొర ఏర్పాట్ల కారణంగానే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాన్ని లేదా మృతుల సంఖ్యపై అధికారులు మాత్రం స్పందించలేదు.

 

చికిత్స కోసం సదర్ ఆస్పత్రికి తరలింపు:

 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భక్తుల సంఖ్య 12 వరకు ఉందని తెలుస్తోంది.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించారు. ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. ఘటన తర్వాత భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు.

 

నేడు నలంద విశ్వవిద్యాలయంలో కన్వొకేషన్

 

సమాచారం ప్రకారం, ఈరోజు నలంద విశ్వవిద్యాలయంలో కాన్వోకేషన్ జరగనుంది. రాజ్‌గిర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనాల్సి ఉండటం, సీఎం నితీష్ కుమార్ కూడా నలంద విశ్వవిద్యాలయ దీక్షాంత సమారోహంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి కూడా ఉంటారు. ఇటువంటి కార్యక్రమం ఉన్న కారణంగానే ఆలయ భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Latest