- ఆర్బీఐ ముందు సర్కారు చేయి చాస్తోంది.
- రాష్ట్ర ఆర్థిక స్థితి అస్తవ్యస్తం.
- ప్రతి కుటుంబంపై రూ. 9 లక్షల భారం.
- కాగ్ నివేదిక సాక్షిగా ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు.
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని, కనీసం రోజువారీ ఖర్చుల కోసం కూడా ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన తాజా గణాంకాలను ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద కేవలం రెండు రోజులు మినహా, మిగిలిన 363 రోజులు ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్‌ల ద్వారానే నిధులు సేకరించిందని ఆమె ఎత్తిచూపారు. సుమారు రూ. 1.30 లక్షల కోట్లు అప్పుగా తెచ్చి సర్కారును నెట్టుకొచ్చారని, 2025 మార్చి 31 నాటికి తిరిగి చెల్లించాల్సిన రూ. 6 వేల కోట్లు కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం గమనార్హమని ఆమె ఆరోపించారు.
రాష్ట్రానికి నెలకు రూ. 12 వేల కోట్ల సొంత ఆదాయం వస్తున్నప్పటికీ, రోజువారీ అవసరాలకు కనీసం రూ. 1.38 కోట్ల నగదు నిల్వలను కూడా నిర్వహించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కవిత విమర్శించారు. రాష్ట్రంపై మొత్తం రూ. 8.65 లక్షల కోట్ల అప్పుల భారం మోపి, ప్రతి కుటుంబంపై సగటున రూ. 9 లక్షల భారాన్ని వేసిందని ఆమె మండిపడ్డారు. ఒకవైపు అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తూనే, మరోవైపు ఇంకా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమని ప్రచారం చేసుకోవడం ప్రజలను వంచించడమేనని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ‘సంపద పెంచుతాం.. పేదలకు పంచుతాం’ అని కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలు వట్టి డొల్ల అని కాగ్ నివేదికతో తేలిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, తెలంగాణను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదేనని కవిత తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే రాష్ట్రం నేడు ఈ స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్ నివేదిక సాక్షిగా ప్రభుత్వ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయని, ఇప్పటికైనా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం మానేసి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె హితవు పలికారు.







