Mahaa Daily Exclusive

  బెంగళూరులో విషాదం.. సాఫ్ట్‌వేర్ జంట ఆత్మహత్య..

Share

బెంగళూరు (కొత్తనూరు), మహా.

సిలికాన్ వ్యాలీలో పెను విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి, ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇద్దరు తెలంగాణ టెక్కీలు బెంగళూరులో విగతజీవులుగా మారారు. ప్రేమించిన వాడు దూరమయ్యాడన్న ఆవేదనతో ఒకరు.. మానసిక ఒత్తిడి తట్టుకోలేక మరొకరు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.

సిద్దిపేట జిల్లాకు చెందిన కుంట భానుచందర్ రెడ్డి (32) నగరంలోని ఓ ప్రైవేటు సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం కొత్తనూరు పరిధిలోని తన అపార్టుమెంట్‌లో భానుచందర్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే ఫ్లాట్‌లో ఆయనతో సహజీవనం చేస్తున్న మరో టెక్కీ (31), గది తలుపులు ఎంతకీ తీయకపోవడంతో ఆందోళన చెందారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది, ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా, భానుచందర్ విగతజీవిగా కనిపించారు. కళ్లముందే ప్రియుడు ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన సదరు యువతి, వెంటనే అపార్టుమెంట్‌లోని 17వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఐబీఎం సంస్థలో పనిచేస్తున్న ఆమె, నిమిషాల వ్యవధిలోనే తనువు చాలించడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భానుచందర్ రెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ కారకులు కారని, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన అందులో పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, వారిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తమకు తెలియదని ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు తెలపడం గమనార్హం. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు, సహజీవనంలో ఎదురైన ఇబ్బందులు లేదా వృత్తిపరమైన ఒత్తిడి మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెక్కల కష్టంతో ఉన్నత స్థితికి చేరుకున్న బిడ్డలు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Latest