Mahaa Daily Exclusive

  ఇండియా పోస్ట్‌ బహుమతుల పేరిట వల..!

Share

  •  నమ్మితే నిండా మునగడమే!
  • ‘170వ వార్షికోత్సవం పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రచారం.
  •  హెచ్చరించిన పీఐబీ

ఢిల్లీ, మహా.

భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) 170వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, ఈ సందర్భంగా వినియోగదారులకు ఉచిత బహుమతులు అందజేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇదంతా పూర్తిగా నకిలీ అని, సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి పన్నిన వ్యూహమని స్పష్టం చేసింది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి వేదికల్లో వైరల్ అవుతున్న ఈ సందేశాల్లోని లింక్‌లను క్లిక్ చేస్తే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.

ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రచార విభాగం ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం రంగంలోకి దిగింది. ఇండియా పోస్ట్ ఇలాంటి ఎటువంటి లక్కీ డ్రాలు గానీ, బహుమతుల పంపిణీ గానీ చేపట్టలేదని ప్రాథమిక విచారణలో తేల్చిచెప్పింది. ‘ఇండియా పోస్ట్ పేరుతో జరుగుతున్న ఈ ప్రచారం పచ్చి అబద్ధం. గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దు. మీ పేరు, ఫోన్ నంబర్, బ్యాంకు వివరాల వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దు’ అని పీఐబీ వెల్లడించింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ సంస్థలు ఇలాంటి ఉచిత ఆఫర్లను వాట్సాప్ ద్వారా ప్రకటించవని ప్రజలు గుర్తించాలని కోరింది.

డిజిటల్ యుగంలో పెరిగిపోతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా సంస్థకు సంబంధించిన ఆఫర్లు లేదా ప్రకటనల గురించి సమాచారం వస్తే, గుడ్డిగా నమ్మకుండా ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా ధ్రువీకరించిన సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలించాలని కోరుతున్నారు. ఆకర్షణీయమైన బహుమతుల ఆశ చూపి ఖాతాలను ఖాళీ చేసే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి నకిలీ సందేశాలను ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని అధికారులు కోరుతున్నారు. అప్రమత్తంగా ఉండటమే సైబర్ నేరాల నుంచి రక్షణకు ఏకైక మార్గమని స్పష్టం చేశారు.

Latest