- కల్యాణలక్ష్మి, రేషన్‌లో అనర్హులకే పెద్దపీట.
- రూ.కోట్ల ప్రజాధనం వృథా.
- పారిశ్రామిక, సాగునీటి ప్రాజెక్టుల్లో అంతులేని జాప్యం.. అసెంబ్లీలో కాగ్ నివేదిక.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో తీవ్రస్థాయిలో లోపాలున్నాయని, తద్వారా భారీగా ప్రజాధనం వృథా అవుతోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర సాధారణ, సామాజిక, ఆర్థిక రంగాల పనితీరుపై రూపొందించిన ఆడిట్ నివేదికలను ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు లబ్ధి చేకూర్చడం నుంచి మొదలుకొని, ప్రణాళికా లోపం వల్ల ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వరకు కాగ్ తన నివేదికలో పలు కీలక అంశాలను ఎత్తిచూపింది. ముఖ్యంగా పేదలకు అండగా ఉండాల్సిన కల్యాణలక్ష్మి, రేషన్ బియ్యం పంపిణీలో జరిగిన అక్రమాలపై కాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కల్యాణలక్ష్మి పథకంలో లబ్ధిదారుల గుర్తింపునకు సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల భారీగా నిధులు పక్కదారి పట్టాయని కాగ్ ఆక్షేపించింది. డేటా తనిఖీకి పటిష్టమైన విధానం లేకపోవడంతో చిన్న వయస్సు ఉన్న వారికి, అధిక ఆదాయం ఉన్న వారికి కూడా లబ్ధి చేకూరిందని, ఈ క్రమంలో అర్హత లేని వారికి సుమారు రూ. 55 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని నివేదికలో పేర్కొంది. ఇదే తరహా అక్రమాలు ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ చోటు చేసుకున్నాయి. సరైన తనిఖీలు లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 83 వేల మందికి పైగా అనర్హులు, మరణించిన వారి పేరిట రూ. 135 కోట్ల విలువైన రేషన్ బియ్యం పంపిణీ అయినట్లు కాగ్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అమృత్’ అమలులోనూ పురపాలక సంస్థలు, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగాల మధ్య సమన్వయం లేక పనులు అస్తవ్యస్తంగా మారాయని ధ్వజమెత్తారు.
మౌలిక సదుపాయాల కల్పనలోనూ ప్రణాళికా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కాగ్ విమర్శించింది. గ్రామీణ రహదారుల నిర్మాణంలో తగిన సర్వేలు నిర్వహించకపోవడం, అటవీ అనుమతులు తీసుకోకపోవడం వల్ల పలు చోట్ల పనులు నిలిచిపోయాయని తెలిపింది. బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ పనులు పూర్తి కాకపోవడంతో ఎనిమిదేళ్లు గడిచినా కొన్ని గ్రామాలకు కనీసం రోడ్డు కనెక్టివిటీ కూడా సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆదిలాబాద్‌లో చేపట్టిన చిన్న సుద్దవాగు ప్రాజెక్టు ప్రారంభించి 16 ఏళ్లు గడిచినా ఇప్పటికీ లక్ష్యం నెరవేరలేదని, మొడికుంట వాగు ప్రాజెక్టులో భూసేకరణ పూర్తి కాకుండానే కాంట్రాక్టు సంస్థకు అడ్వాన్సులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పేర్కొంది.
రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) పనితీరుపై కూడా కాగ్ పలు ప్రశ్నలు సంధించింది. జహీరాబాద్ నిమ్జ్, హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం భూసేకరణలో ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జాప్యం జరిగిందని, దీనివల్ల ఆశించిన పెట్టుబడులు, ఉపాధి కల్పన సాధ్యం కాలేదని స్పష్టం చేసింది. నిమ్జ్ భూ సేకరణ కోసం హడ్కో నుంచి తీసుకున్న రుణంలో రూ. 317 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించడాన్ని తప్పుపట్టింది. కంపెనీలకు అవసరానికి మించి భూములు కేటాయించడం వల్ల ఆయా సంస్థలకు రూ. కోట్లాది లబ్ధి చేకూరిందని ఆక్షేపించింది. విద్యా, క్రీడా రంగాల్లోనూ ప్రజాధనం వృథా అయిందని, మైనార్టీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు నిరుపయోగంగా మారగా, పలు జిల్లాల్లో స్టేడియాల నిర్మాణాలు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయని కాగ్ తన నివేదికలో ఎండగట్టింది.








