Mahaa Daily Exclusive

  సెమీకండక్టర్ సప్లై చైన్లో భారత్ కీలక శక్తి..

Share

  •  సనంద్‌లో రూ. 3,300 కోట్లతో కైనెస్ ప్లాంట్‌ ప్రారంభం.
  •  జైన సంస్కృతి ప్రతీకగా మ్యూజియం ఆవిష్కరణ.
  •  అసాధ్యమైన పనిని 900 రోజుల్లోనే సుసాధ్యం చేశాం.
  • ఇది దేశ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
  •  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

 

సనంద్ (గుజరాత్), మహా.

ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా గొలుసులో (సప్లై చైన్) భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా అవతరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మంగళవారం గుజరాత్‌లోని సనంద్‌లో రూ. 3,300 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించిన కైనెస్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రతి ఉత్పత్తి రంగంలోనూ దేశం స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా తాము సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించామని వెల్లడించారు. సెమీకండక్టర్ తయారీ రంగంలోకి ఒక భారతీయ కంపెనీ అడుగుపెట్టడం గర్వకారణమని, ఇది కేవలం ఒక పారిశ్రామిక విధానం మాత్రమే కాదని, మారుతున్న 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా భారత్ ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని ఆయన నొక్కి చెప్పారు. కొవిడ్ మహమ్మారి సమయంలో సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని, చిప్‌ల తయారీకి భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చాలనే సంకల్పంతో 2021లో ఈ మిషన్‌కు శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు.

మైక్రాన్ ప్లాంట్‌ తర్వాత దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండో అతిపెద్ద సెమీకండక్టర్ యూనిట్‌గా కైనెస్ ప్లాంట్ నిలవనుంది. ఇక్కడ ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EV), పారిశ్రామిక మోటార్ డ్రైవ్‌లు, గృహోపకరణాల్లో విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించే ‘అడ్వాన్స్‌డ్ ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్స్’ (IPM) ఉత్పత్తి చేయనున్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాత ఈ ప్లాంట్ నుంచి రోజుకు సుమారు 63.3 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరగనుంది. ఈ ప్లాంట్ స్థాపన ద్వారా భారత చిప్ ఎకోసిస్టమ్‌లో ఉన్న వెలితి పూడటమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ ఒక కీలక శక్తిగా ఎదగడానికి మార్గం సుగమం కానుంది. ప్రాజెక్టుల అమలు వేగాన్ని ప్రస్తావిస్తూ.. గత నెలలో ప్రారంభమైన మైక్రాన్ ప్లాంట్‌ను కేవలం 900 రోజుల్లోనే పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇందుకు ఏళ్ల సమయం పడుతుందని, కానీ స్పష్టమైన ఉద్దేశం, అంకితభావం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమని భారత్ నిరూపించిందని ప్రధాని మోదీ కొనియాడారు.

అనంతరం మహావీర్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని కోబా గ్రామంలో నిర్మించిన ‘సమ్రాట్ సంప్రతి మ్యూజియం’ను ప్రధాని ప్రారంభించారు. జైన మతగురువుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహావీర్ జైన ఆరాధన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియాన్ని ఆయన ఆవిష్కరించారు. మౌర్య చక్రవర్తి అశోకుడి మనవడైన సమ్రాట్ సంప్రతి మహారాజ్ పేరు మీదుగా దీనిని తీర్చిదిద్దారు. జైన వారసత్వం, అహింసా విలువలను చాటిచెప్పే ఈ మ్యూజియంలో 2 వేలకు పైగా అరుదైన కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. శతాబ్దాల నాటి రాతి, లోహ విగ్రహాలు, పురాతన రాతప్రతులు మరియు నాణేలను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఇక్కడ అత్యాధునిక ఆడియో-విజువల్ టెక్నాలజీని వినియోగించడం విశేషం. జైన గురువులతో సంభాషించిన ప్రధాని, భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒకే రోజు అటు అత్యాధునిక సాంకేతికతకు ప్రతీకగా సెమీకండక్టర్ ప్లాంట్‌ను, ఇటు ప్రాచీన సంస్కృతికి అద్దం పట్టే మ్యూజియంను ప్రారంభించడం ద్వారా నవ భారత ప్రగతిని ఆయన చాటిచెప్పారు.

Latest