Mahaa Daily Exclusive

  అసోం ఎన్నికల బరిలో బీజేపీ హామీల జల్లు.. మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మల..

Share

  • అసోం ఎన్నికల బరిలో బీజేపీ హామీల జల్లు.
  • :మహిళా ఓటర్లే లక్ష్యం.
  • ఒరునోదోయ్‌ కింద నెలకు రూ.3,000.. లఖ్‌పతి దీదీలకు రూ.25వేల సాయం.
  • యూసీసీ అమలు, లవ్‌ జిహాద్‌పై కఠిన చర్యలు..
  •  మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మల.

గువహటి, మహా:

అసోం అసెంబ్లీ ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో అధికార భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల ప్రణాళికను (మేనిఫెస్టో) విడుదల చేసింది. మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన, సాంస్కృతిక పరిరక్షణే ధ్యేయంగా మొత్తం 31 ప్రధాన హామీలతో కూడిన ఈ పత్రాన్ని మంగళవారం గువహటిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలోని దాదాపు 2.45 లక్షల మంది ప్రజల నుంచి సేకరించిన సూచనల ఆధారంగా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ మేనిఫెస్టోలో మహిళలకు వరాల జల్లు కురిపించింది బీజేపీ. ప్రస్తుతం అమలులో ఉన్న ‘ఒరునోదోయ్’ పథకం కింద మహిళలకు అందజేస్తున్న నగదు సాయాన్ని రూ.3,000కు పెంచుతామని పార్టీ హామీ ఇచ్చింది. అలాగే ‘లఖ్‌పతి దీదీ’ పథకం ద్వారా రాష్ట్రంలోని 40 లక్షల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యంగా, ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. అసోంను దేశంలోనే అత్యంత ప్రకాశవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.

రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. అసోంలో యూసీసీని అమలు చేస్తామని, అయితే రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలోకి వచ్చే గిరిజన ప్రాంతాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు. లవ్ జిహాద్ పేరిట జరుగుతున్న అకృత్యాలపై ఉక్కుపాదం మోపుతామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రానికి పెనుశాపంగా మారిన వరద సమస్య నివారణకు తొలి రెండేళ్లలోనే రూ.18,000 కోట్లు ఖర్చు చేస్తామని, రాబోయే ఐదేళ్లలో 2 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ, యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.

కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, గత కాంగ్రెస్ పాలనలో అసోం అశాంతితో అట్టుడికిందని విమర్శించారు. 2007 ఒక్క ఏడాదిలోనే వందలాది మంది ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేస్తూ, బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి సుస్థిరతలు నెలకొన్నాయని కొనియాడారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 81 శాతానికి పైగా గృహాలకు తాగునీరు అందుతోందని, గత నాలుగేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా గణనీయమైన వృద్ధి సాధించిందని ఆమె పేర్కొన్నారు.

Latest