- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం.
- హీరోలకు 90 రోజులకోసారి ‘హెయిర్ టెస్ట్’ తప్పనిసరి.. ఎమ్మెల్యే సంచలన డిమాండ్.
- నేతలకూ పరీక్షలు ఉండాలి.. నామినేషన్ ముందే తేలాలంటూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ అంశం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల మధ్య చిచ్చు రేపింది. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు అంతే ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టే క్రమంలో సినిమా హీరోలు సమాజానికి ఆదర్శంగా ఉండాలని, అందుకోసం వారు క్రమం తప్పకుండా డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచించడమే ఈ వివాదానికి మూలమైంది. జడ్చర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వ్యవహారాల్లో తరచూ సినీ పరిశ్రమ పేరు వినపడటం దురదృష్టకరమని, హీరోలకు ఉండే విపరీతమైన క్రేజ్ దృష్ట్యా వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా డ్రగ్స్ వాడకాన్ని గుర్తించే విధానంపై ఎమ్మెల్యే సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. సాధారణంగా చేసే యూరిన్ టెస్ట్ ద్వారా కేవలం 14 రోజుల లోపు వాడకాన్ని మాత్రమే గుర్తించవచ్చని, కానీ ‘హెయిర్ టెస్ట్’ (వెంట్రుకల పరీక్ష) నిర్వహిస్తే గత 90 రోజుల్లో డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుందని ఆయన వివరించారు. అందుకే ప్రతి మూడు నెలలకోసారి హీరోలు ఈ పరీక్షలు చేయించుకోవాలని, ఆ రిపోర్టులు సానుకూలంగా ఉంటేనే వారి సినిమాలను థియేటర్లలో విడుదల చేసేలా నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేస్తేనే డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం సాధ్యమవుతుందని, అభిమానులు కూడా తమ హీరోలను చూసి డ్రగ్స్‌కు దూరంగా ఉంటారని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్ర పరిశ్రమ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై మంచు విష్ణు తనదైన శైలిలో ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఎమ్మెల్యేకు చురకలు అంటించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన సూచన చాలా బాగుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూనే.. ఇదే సూత్రాన్ని రాజకీయ నాయకులకు కూడా వర్తింపజేయాలని విష్ణు ప్రతిపాదించారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు ప్రజా ప్రతినిధులు కూడా ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తాను ఆలోచిస్తున్నానని, నేతలు కూడా పారదర్శకంగా ఉంటేనే ఓటర్లు సంతోషిస్తారని ఆయన పేర్కొన్నారు. కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్న సంకేతాన్ని విష్ణు ఈ పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు.
ఈ వివాదంపై నెటిజన్ల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ నియంత్రణ కోసం హీరోలు పరీక్షలు చేయించుకోవడంలో తప్పు లేదని కొందరు సమర్థిస్తుంటే.. కేవలం సినిమా రంగాన్నే దోషిగా నిలబెట్టడం సమంజసం కాదని మరికొందరు వాదిస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా తమ ఆస్తులను, వ్యక్తిగత ప్రవర్తనను బహిర్గతం చేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి అనిరుధ్ రెడ్డి ప్రారంభించిన ఈ చర్చ ఇప్పుడు ‘హీరోలు వర్సెస్ రాజకీయ నాయకులు’ అన్నట్టుగా మారి, రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంపై ప్రభుత్వం లేదా ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






