- 74 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తొలిసారి నిశ్శబ్దం.
- కార్మిక క్షేత్రంలో కమ్యూనిస్టుల వెనకడుగు.
- మిల్లుల మూతతో బలహీనపడ్డ ఓటు బ్యాంకు.
- డీఎంకే కూటమిలో కుదరని సీట్ల సర్దుబాటు.
- పోటీలో లేకున్నా మద్దతు తప్పదన్న లెఫ్ట్.
చెన్నై, మహా.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయానికి తాత్కాలికంగా తెరపడింది. ఒకప్పుడు వామపక్షాల కంచుకోటగా, ‘దక్షిణాది మాంచెస్టర్’గా విరాజిల్లిన కోయంబత్తూరు జిల్లాలో ఈసారి అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. 1952లో దేశంలో జరిగిన తొలి సాధారణ ఎన్నికల నుంచి నేటి వరకు నిరంతరాయంగా బరిలో నిలిచిన కమ్యూనిస్టు పార్టీలు.. సుమారు 74 ఏళ్ల తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్యర్థులు లేకుండానే కనిపిస్తున్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) రెండూ ఈసారి జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పోటీ చేయడం లేదు. దశాబ్దాల కాలంగా ఎర్రజెండా నీడన సాగిన కోయంబత్తూరు రాజకీయాల్లో ఈ మార్పు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కోయంబత్తూరు ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన టెక్స్టైల్ మిల్లులు, వాటిపై ఆధారపడిన కార్మిక వర్గమే వామపక్షాలకు అసలైన బలం. అయితే, మారుతున్న కాలంతో పాటు పారిశ్రామిక రంగంలో వచ్చిన సంక్షోభం కమ్యూనిస్టుల ఎన్నికల బలాన్ని దెబ్బతీసింది. ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి తర్వాత నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ (NTC) పరిధిలోని మిల్లులతో పాటు అనేక ప్రైవేటు మిల్లులు మూతపడటం వామపక్షాలకు వెన్నుదన్నుగా నిలిచే కార్మిక సంఘాల ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. కార్మికులు చెల్లాచెదురు కావడంతో వారి ఓటు బ్యాంకుపై పట్టు సడలింది. చారిత్రక నేపథ్యం పరిశీలిస్తే.. కోయంబత్తూరు ఈస్ట్, పేరూరు, సింగనల్లూరు వంటి స్థానాల్లో సీపీఎం గతంలో విజయకేతనం ఎగురవేయగా, వాల్పారై నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. లోక్సభ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు ఇక్కడి నుంచి పలుమార్లు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.
ప్రస్తుత 2026 ఎన్నికల్లో వామపక్షాలు పోటీకి దూరంగా ఉండటానికి డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కుదరని సీట్ల సర్దుబాటే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. వామపక్షాలు పట్టుబట్టిన వాల్పారై, సింగనల్లూరు వంటి స్థానాలను డీఎంకే తన వద్దే ఉంచుకోవడంతో, మిత్రధర్మాన్ని పాటిస్తూ వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తమకు పట్టున్న ప్రాంతాల్లో అభ్యర్థులను నిలపలేకపోయినప్పటికీ, కూటమి ప్రయోజనాల దృష్ట్యా డీఎంకే అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తామని వామపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. పోటీలో లేకపోయినా, తమ ఉనికిని చాటుకుంటూ కూటమి విజయంలో భాగస్వాములవుతామని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా, దశాబ్దాల పాటు కోయంబత్తూరు వీధుల్లో గర్జించిన ఎర్రజెండా ఈసారి బ్యాలెట్ బాక్సుల వద్ద కనిపించకపోవడం ఒక చారిత్రక పరిణామమేనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.






