- క్షేత్రస్థాయి విచారణతో లబ్ధిదారుల ఆందోళన.
- వార్షికాదాయం రూ. 6 లక్షలు దాటితే వేటు తప్పదా.
- ఊరూరా జీపీవోల ఆకస్మిక తనిఖీలు.
- ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా అనర్హులేనా? ‘రుణాల’ కోసమేనంటున్న సామాన్యులు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన సామాన్య ప్రజల్లో ప్రస్తుతం ఒక కొత్త ఆందోళన మొదలైంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి అందిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతుండటం కార్డుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వార్షికాదాయం రూ. 6 లక్షల కంటే ఎక్కువగా ఉండి, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారిని గుర్తించి వారి కార్డులను రద్దు చేస్తారనే ప్రచారం గ్రామాల్లో జోరుగా సాగుతోంది. స్వయంగా గ్రామ పరిపాలన అధికారులు (జీపీవోలు) లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి వారు దాఖలు చేసిన ఐటీ వివరాల గురించి ప్రశ్నిస్తుండటంతో ఈ గందరగోళం మరింత ముదిరింది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ ఆకస్మిక తనిఖీలు లక్షలాది మంది లబ్ధిదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 1.01 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, దాదాపు 3.25 కోట్ల మంది వీటి ద్వారా లబ్ధి పొందుతున్నారు. పేదలకు రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా, ప్రభుత్వ పథకాలైన ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి కీలక ప్రయోజనాలకు పాస్పోర్టులా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో కార్డు రద్దు కావడం అంటే అన్ని సంక్షేమ పథకాలకు దూరమవడమేనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 30,186 మందిని, సిద్దిపేట జిల్లాలో 14,200 మందిని అధికారులు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య కొన్ని లక్షల్లో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ విచారణలో ఒక కీలక సాంకేతిక అంశం పట్ల లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినంత మాత్రాన వారు ధనవంతులు కాదని, పన్ను చెల్లించే స్థాయికి రిటర్న్స్ దాఖలు చేసేవారికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు, అలాగే యూపీఐ లావాదేవీల వల్ల కట్ అయిన టీడీఎస్ రీఫండ్ క్లెయిమ్ చేసుకోవడం కోసం తక్కువ ఆదాయం ఉన్నా ఐటీ రిటర్న్స్ సమర్పిస్తుంటారు. ప్రభుత్వం ఈ సున్నితమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రిటర్న్స్ డేటా ఆధారంగా కార్డులు రద్దు చేస్తే.. లక్షలాది మంది నిజమైన పేదలు నష్టపోయే ప్రమాదం ఉందని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ఈ గందరగోళాన్ని వెంటనే నివృత్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.






